అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి భూమి పూజకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పూజకు ప్రధాని మోదీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఇదే ఇప్పుడు వివాదమైంది. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని హోదాలో మోదీ కార్యక్రమానికి హాజరుకావడం పట్ల అభ్యంతరం తెలిపారు. ఒక వర్గానికి చెందిన ఆలయం నిర్మాణానికి ప్రధాని హోదాలో మోదీ హాజరుకానుండటం రాజ్యాంగ విరుద్దమని అన్నారు. 400 ఏళ్ళ చరిత్ర కలిగిన బాబ్రీ మసీదును 1992లో కొందరు క్రిమినల్స్ ధ్వంసం చేశారని, లౌకికవాదమనేది రాజ్యాంగంలో భాగమని, దానిని గౌరవించాలని అన్నారు. దీంతో తెలంగాణ బీజేపీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.
ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ అయోధ్య భూమిపూజకు వెళ్లరాదంటూ అసదుద్దీన్ ఓవైసీ చేసిన విమర్శలు చవకబారుగా ఉన్నాయని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో, ప్రధానిపై ఓవైసీ చేసిన కామెంట్లను ఖండిస్తున్నామని అన్నారు. భూమి పూజకు మోదీ ప్రధాని హోదాలోనే హాజరవుతారని ఖరాఖండిగా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హిందువుల ఆకాంక్ష మేరకే మోదీ భూమి పూజ కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించారు.
బాబ్రీ మసీదు కూల్చివేతక గురించి ఒవైసీ వ్యాఖ్యలకు సమాధానమిస్తూ మసీదు 400 ఏళ్ళ క్రితం ఉంటే అంతకుముందు అక్కడున్న వేల ఏళ్ళ చరిత్ర కలిగిన రామ మందిరాన్ని ఎవరు కూల్చారో చెప్పాలని అన్నారు. కొత్త రామ మందిరం ఎత్తు 128 అడుగులు కాగా వెడల్పు 140 అడుగులు, పొడవు 270 అడుగులుగా ఉండనుంది. రామాలయాన్ని మొత్తం రెండంతస్తుల్లో కట్టనున్నారు. మొదటి అంతస్తులో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. రెండో అంతస్థు పైభాగాన శిఖరం ఉంటుంది. 67 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ స్థలం కోసం రూ.500 కోట్లు కేటాయించారు.