తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో పోలీసులు ఓ వాహనంలో భారీగా నగదు, బంగారాన్ని గుర్తించిన నేపథ్యంలో ఆ వాహనం ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిదని అనుమానం వ్యక్తం అవుతోంది. కారుపై బాలినేని స్టిక్కరింగ్ ఉండటంతో ఆ నగదు, బంగారం అక్రమంగా తరలిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా సహా మెయిన్ స్ర్టీమ్ మీడియాలో ఇదే హాట్ న్యూస్ అయింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రిబాలినేని ఆరోపణలపై ధ్వజమెత్తారు. ఆ వాహనం, బంగారం, నగదు తనదని టీడీపీ నేతలు నిరుపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు.
అంతేకాదు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. మరి ఆరోపణని నిరుపించే సత్తా టీడీపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. చేసే ఆరోపణకు అర్ధం ఉండాలన్నారు. మూడు దశాబ్ధాల రాజకీయజీవితంలో మచ్చ లేని రాజకీయాలు చేసానన్నారు. విమర్శలు చేసే టీడీపీ నేత బోండా ఉమకు సిగ్గుండాలన్నారు. వెంటనే ఆరోపణల్ని వెనక్కి తీసుకుని క్షమాపణలు అడగాలని డిమాండ్ చేసారు. అలాగే టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ పై కూడా బాలినేని ధ్వజమెత్తారు. లోకేష్ కి తనని విమర్శించే స్థాయిలేదన్నారు. ముందు రాజకీయ నాయకుడిగా తన అనుభవం ఎంతో తెలుసుకుని ఎదుట వారి రాజకీయ జీవితాల గురించి మాట్లాడాలని హితవు పలికారు.
ఇంకా ఎక్కువ మాట్లాడిదే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ పార్టీ లేకుండా చేస్తానని హెచ్చరించారు. ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేసానన్నారు. పోలీసుల విచారణలో వాస్తవాలు బయటకొచ్చినప్పుడు మళ్లీ మాట్లాడుతానని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేసారు. శవ రాజకీయాలు చేసే తనకు అలవాటు లేదని..అలాంటి పనులు టీడీపీ నేతలకే వెన్నతో పెట్టిన విద్యలా మొదటి నుంచి ఉందని మండిపడ్డారు. మరి మంత్రి వ్యాఖ్యలపై బోండా ఉమ, లోకేష్ ఎలా ప్రతిస్పందిస్తారో.