2019 ఎన్నికల తరువాత పతానవస్థకు చేరుకున్న టీడీపీ పార్టీని మళ్ళీ పట్టాలు ఎక్కించడానికి ప్రయత్నిస్తున్న వారిలో చంద్రబాబు నాయుడు తరువాత నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ ప్రముఖులు. నారా లోకేష్ 2019 ఎన్నికల తరువాత పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. కరోనా సమయంలో కొంచెం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం పార్టీని ముందుకు నడిపించే కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడులాగే రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. నారా లోకేష్ కు హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్నారు.
లోకేష్ కోసం త్యాగం చేస్తున్న బాలయ్య
రానున్న రోజుల్లో టీడీపీని ముందుకు నడిపించేది నారా లోకేషని స్పష్టంగా అర్ధమవుతుంది. అందుకే ఆయన ఇప్పటి నుండి పార్టీలో తనదైన ముద్ర వేసుకోవడానికి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. మొన్న ఏర్పాటు చేసిన కమీటీలలో కూడా లోకేష్ కు అనుకూలంగా ఉన్నవారిని మాత్రమే తీసుకున్నారు. పార్టీలో ఉన్న కీలక నేతలందరూ కూడా లోకేష్ కు సహకరిస్తున్నారు. లోకేష్ కూడా గతంలో ఎమ్మెల్సీగా, ఎంపీగా చేసిన దానికంటే కూడా ఇప్పుడు ఎక్కువ ప్రజల్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో తనపైను ఉన్న అనుమానాలను ఇప్పుడు తొలగించడానికి లోకేష్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అయితే 2019 ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేసిన లోకేష్ వైసీపీ నేత రామకృష్ణ రెడ్డిపై 5000 ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. రానున్న రోజుల్లో పార్టీని నడిపించే నేతనే గెలవకపోతే బాగోదు కాబట్టి ఒక కంచుకోట లాంటి నియోజక వర్గం గురించి టీడీపీ నేతలు వెతుకుతున్నారు. ఈ వెతుకులాటలో గుంటూరు జిల్లాలో కమ్మ నియోజక వర్గం బలంగా ఉన్న నియోజక వర్గాన్ని చంద్రబాబు నాయుడు ఎంపిక చేస్తున్నారు. అలాగే అనంతపురంలోని హిందూపూర్ ను ఎంపిక చేస్తున్నట్టు సమాచారం. హిందూపూర్ లో ఇప్పుడు బాలకృష్ణ ఎమ్మెల్యే ఉన్నారు. కానీ రానున్న పార్టీని నడిపించే తన అల్లుడైన లోకేష్ కోసం బాలయ్య త్యాగం చేయనున్నారని సమాచారం.
లోకేష్ పార్టీని నడిపించగలడా!!
లోకేష్ 2014 నుండి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ తనకంటూ గుర్తింపు తెచ్చుకునేలా చేసిన పనులు చాలా తక్కువ. కనీసం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తనపై ఉన్న చిన్న చిన్న నిందలకు కూడా సమాధానం చెప్పలేకపోయారు. అలాగే ఇప్పుడు వైసీపీని ప్రశ్నించడంలో కూడా విఫలమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి లోకేష్ ఇంకా చురుగ్గా వ్యవహరించాలని, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూనే ప్రజలకు చేరువ కావాలని రాజకీయ పండితులు లోకేష్ కు సలహా ఇస్తున్నారు. రానున్న రోజుల్లో టీడీపీని లోకేష్ ఎలా నడిపిస్తారో వేచి చూడాలి.