‘అబ్బే, నందమూరి బాలకృష్ణ ఉద్దేశ్యం అది కానే కాదు. చిన్నోడు కదా.. సినిమాల్లో ఇంకా చాలా ఎత్తుకు ఎదగాల్సినోడు.. ఇప్పుడే ఎందుకు రాజకీయాల ఒత్తిడి.? అన్నదే ఆయన చెప్పిన మాట.. దానికి పెడార్థాలు తీయొద్దు..’ అంటూ జూనియర్ ఎన్టీయార్ అభిమానుల్ని ఉద్దేశించి కొందరు టీడీపీ అభిమానులు ‘సోపు’ రాసే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ, డ్యామేజ్ చాలా పెద్దగానే జరిగిపోయింది. బాలయ్య ఉద్దేశ్యం ఏంటన్నది యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు అర్థం చేసుకున్నారు. కావాలనే, జూనియర్ నందమూరి తారకరామారావుని తెలుగుదేశం పార్టీ దూరం పెట్టిందనే వాదన ఇప్పుడు వారిలో బలంగా నాటుకుపోయింది. ‘ఇకపై టీడీపీతో సంబంధాలు తెగిపోయినట్లే..’ అన్న భావన యంగ్ టైగర్ అభిమానుల్లో కలుగుతోంది. అదే అభిప్రాయాన్ని వాళ్ళంతా సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. మరి, యంగ్ టైగర్ అభిమానులు టీడీపీకి దూరమైతే, వాళ్ళెవరికి దగ్గరవుతారు.? ఖచ్చితంగా ఆ ఓట్లు అటు వైసీపీకో, ఇటు జనసేనకో.. ఇంకో పక్క బీజేపీకో వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
టీడీపీకి మాత్రం యంగ్ టైగర్ అభిమానుల నుంచి ఇకపై ఒక్క ఓటు కూడా పడే అవకాశం వుండకపోవచ్చు. ఓడిపోతుందని తెలిసీ, గతంలో కూకట్ పల్లి నియోజకవర్గ ఉప ఎన్నికల్లో హరికృష్ణ కుమార్తె సుహాసినిని బరిలోకి దించి చంద్రబాబు పెద్ద తప్పిదం చేశారనీ, అప్పట్లోనే ఎన్టీయార్ సహా కళ్యాణ్ రామ్.. ఆ పన్నాగాన్ని గుర్తించారనీ ఇప్పుడు తీరిగ్గా యంగ్ టైగర్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. బాలయ్య తెలిసే మాట్లాడారో, తెలియక మాట్లాడారోగానీ.. డ్యామేజ్ గట్టిగానే జరిగిపోయింది.