టీడీపీ పతనానికి తనవంతు సాయం చేస్తున్న బాలకృష్ణ

balakrishna-slaps-his-fans-during-municipality-election-campaign

balakrishna-slaps-his-fans-during-municipality-election-campaign

తెలుగుదేశం పార్టీ పతనం అంచున కొట్టుమిట్టాడుతోంది చాలాకాలంగా. ‘పార్టీ బాధ్యతల్ని మా బాలయ్యకు అప్పగించెయ్యండహో..’ అంటూ నందమూరి వంశ వీరాభిమానులైన కొందరు టీడీపీ నేతలు ఎప్పటినుంచో నినదిస్తున్నారు. ‘ఇంకా నయ్యం.. బాలయ్యకు పార్టీని అప్పగిస్తే, క్షణాల్లో పార్టీ కాలగర్బంలో కలిసిపోతుంది..’ అనేవారూ లేకపోలేదు. సరే, ఎవరి వాదనలు వారివి.

అసలు విషయానికొస్తే, బాలయ్య మునిసిపల్ ఎన్నికల ప్రచారం కోసం సొంత నియోజకవర్గం హిందూపురంలో హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ అభిమాని, బాలయ్య ఫొటోలు తీయడానికి ప్రయత్నించాడు తన కెమెరాతో. అంతే, బాలయ్యకు ఒళ్ళు మండిపోయింది. ఆ అభిమాని చెంప ఛెళ్ళుమనిపోయిందంతే. అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపు ఛెంప ఛెళ్ళుమనిపోవడం.. ఆ వెంటనే ఇంకో రెండు మూడు దెబ్బలు పడిపోవడం జరిగిపోయాయి. ఊహించని ఈ ఘటనతో అందరూ అవాక్కయ్యారు.. కాస్త తేరుకుని, బాలయ్యకు దూరంగా జరిగారు. అయినా, బాలయ్యకు ఇదేమన్నా కొత్తా.? ఆయన అభిమానులకేమన్నా కొత్తా.? కొట్టుడు ఈయనకి కొత్త కాదు.. కొట్టించుకొనుడు ఆయనగారి అభిమానుకూ కొత్త కాదు. నిజానికి, అత్యంత హేయమైన వ్యవహారమిది. ఓ వ్యక్తి ఎంతటి గొప్పవాడైనాసరే, ఇంకో వ్యక్తిపై భౌతిక దాడికి దిగడం దుర్మార్గం. క్షమించరాని విషయమిది. కానీ, ఏం చేస్తాం.? బాలయ్య ప్రముఖ సినీ నటుడు, పైగా ఎమ్మెల్యే. దాంతో అలా ఆయనకు చెల్లిపోతోందంతే. అయినా కొట్టించుకునేవాళ్ళకు లేని నొప్పి మనకెందుకట.? అని లైట్ తీసుకుంటే చెయ్యడానికేముంది.? ఇలాంటి వ్యవహారాల్లో సుమోటోగా కేసులు నమోదు చేయాలి. ఆయన ఓ పార్టీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిథి. ప్రజల మీద దాడి చేసేవాడు ప్రజా ప్రతినిథి ఎలా అవుతాడు.?