నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడతారో ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్లి ముగిస్తారో ఆయనకే తెలియదు. అడిసినిమా వేడుకైన, పొలిటికల్ మీటింగ్ అయినా, రోడ్ షో అయినా బాలకృష్ణ ఫ్లో ఒకేలా ఉంటుంది. ఎవ్వరికీ తెలియని, తనకు మాత్రమే తెలుసనుకున్న విషయాలను చెప్పి తన విషయ పరిజ్ఞానాన్ని ప్రదర్శించాలనే తపన ఆయనలో ఉప్పొంగుతూ ఉంటుంది. తాజాగా ఒక సినిమా వేడుకకు హాజరైన ఆయన సినిమా విషయాలతో పాటు మరెన్నో విషయాలను ప్రస్తావించారు. కార్తీక్ సోమవారం ప్రాశస్త్యం గురించి చెప్పడం ప్రారంభించిన ఆయన మోడీ మీదకి వెళ్లి సముద్ర గర్భంలో ఉందని చెబుతున్న ద్వారకను టచ్ చేసి చివరకు కరోనా టాపిక్ ఎత్తుకుని మళ్ళీ సినిమాల దగ్గరకి వచ్చేశారు.
ఒక్కసారి మైక్ పెట్టుకుంటే ఇన్ని సంగతులు కవర్ చేయవచ్చా అన్నట్టు మాట్లాడారు. ఈరోజుల్లో టీవీల్లో స్వామీజీలు చెబుతున్నట్టు పొద్దునే లేచి చన్నీళ్లతో తలస్నానం చేయడం మంచిది కాదని, కరోనా అనేది నియోనియాకు చెందినదని, కాబట్టి వేడి నీళ్లతోనే తలస్నానం చేయమని చెప్పి కరోనాకు వ్యాక్సిన్ రాలేదు. రాదు కూడ. దాని గురించి నాకు తెలుసు. దాంతోనే సహజీవనం చేయాలి అంటూ పెద్ద బాంబ్ వేశారు. నిజానికి ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని చూస్తోంది. కరోనా రూపాంతరాలు చెందుతోందని, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఉంటాయని అంటున్నారు. మరణాలు తగ్గాయి కానీ పూర్తిగా ఆగలేదు. జనం కరోనా బారిన పడుతూనే ఉన్నారు.
ప్రపంచ ఫార్మా రంగాలన్నీ వ్యాక్సిన్ తయారిటీలో తలమునకలై ఉన్నాయి. అమెరికా, రష్యాలలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కొందరు దిగ్గజాలు వ్యాక్సిన్ కనిపెట్టగల సామర్థ్యం ఇండియాకు ఉందని, ఆ దేశం నుండే ప్రపంచానికి వ్యాక్సిన్ వస్తుందని అంటున్నారు. పరిశోధనల్లో కనబడుతున్న పురోగతి దృష్ట్యా వ్యాక్సిన్ వస్తుందనే నమ్మకం జనంలో బలపడుతోంది. ఇలా ప్రపంచమంతా ఆశావాద దృక్పథంతో బ్రతుకుతుంటే బాలయ్య మాత్రం వ్యాక్సిన్ రాదని తెల్చిపారేయడం చూస్తే ఒక నిట్టూర్పు వదిలి ఊరుకోవడం తప్ప ఇంకేం చేయగలం.