వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని యుద్ధానికి పిలిచేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మాటలు కోటలు దాటేస్తాయ్.. చేతలు మాత్రం గడప కూడా దాటవ్. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఏం జరిగింది.? స్థానిక ఎన్నికల్లో ఏం జరిగింది.? అయినా, పవన్ మార్కు తాటాకు చప్పుళ్ళు కొనసాగుతూనే వున్నాయి.
‘సార్వత్రిక ఎన్నికలదాకా ఎందుకు.? బద్వేల్ బై పోల్ వుందిగా.. తేల్చేసుకుందాం..’ అంటూ పవన్ కళ్యాణ్‌కి సవాల్ విసురుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ‘ఎవరు పోటీ చేయాలన్నదానిపైచర్చిస్తున్నాం..’ అంటూ జనసేన పార్టీ చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తోంది. మిత్రపక్షం బీజేపీని కాదని తామే స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించడానికీ తటపటాయించాల్సిన దుస్థితి జనసేనది.
అనారోగ్యంతో బద్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యే (అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే) కొన్నాళ్ళ క్రితం చనిపోతే, అప్పటినుంచి ఇప్పటిదాకా.. ఆ నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసుకోలేకపోయింది జనసేన. నిజానికి, ఉప ఎన్నికలు తలెత్తుతాయి గనుక.. విపక్షాలు యాక్టివ్ అవ్వాల్సి వుంటుంది. ఈ విషయంలో టీడీపీ కాస్త బెటర్. బీజేపీ – జనసేన పూర్తిగా లైట్ తీసుకున్నాయి అప్పట్లో.
ఇప్పుడెలాగూ వైసీపీని పవన్ యుద్ధానికి పిలిచేశారు గనుక.. యుద్ధ రంగం సిద్ధమయ్యింది.. మరి, ఆ యుద్ధ రంగానికి జనసేన వెళుతుందా.? లేదంటే, ‘మా వల్ల కాదు’ అని చేతులెత్తేస్తుందా.? ఒకవేళ మిత్రపక్షం బీజేపీని ఒప్పించి జనసేన బరిలోకి దిగినా, కనీసం డిపాజిట్ తెచ్చుకునే పరిస్థితి వుంటుందో లేదో కూడా అర్థం కావడంలేదు జనసైనికులకి. పెద్దగా సమయం లేదు.. జనసేన పార్టీ అక్కడ సరైన అభ్యర్థిని నిలబెట్టడానికి. ఇప్పుడు తూతూమంత్రంగా హడావిడి చేసినా అది పార్టీకి నష్టమే కలిగిస్తుంది. ‘ప్రలోభాలకు దిగకుండా.. ఓటర్లను బెదిరించకుండా.. వైసీపీ పోటీ చేస్తే..’ అంటూ జనసైన పార్టీ నేతలు, జనసైనికులు దీర్ఘాలు తీస్తున్న వైనం చూస్తోంటే, ముందే చేతులెత్తేసినట్టుంది.