కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగబోతోంది. వైసీపీ నుంచి డాక్టర్ సుధ పేరుని ఖరారు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ అభ్యర్థిగా. సిట్టింగ్ ఎమ్మెల్యే సతీమణి సుధ పోటీలోకి దిగుతుండడంతో, ఉప ఎన్నిక ఏకపక్షమే కాబోతోంది.
తిరుపతి ఉప ఎన్నిక విషయానికొస్తే, అక్కడ సిట్టింగ్ ఎంపీ కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇవ్వకపోయినా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచారానికి వెళ్ళకపోయినా.. చాలా తేలిగ్గా వైసీపీ విజయాన్ని అందుకుంది. సో, బద్వేలు ఉప ఎన్నిక విషయంలో వైసీపీ ఎక్కువగా కంగారు పడాల్సిందేమీ లేదు. అయితే, అలసత్వం అస్సలు వద్దనీ, ఓవర్ కాన్ఫిడెన్స్ వుండకూదనీ, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, బద్వేలు ఉప ఎన్నికపై సమీక్ష సందర్భంగా పార్టీ ముఖ్య నేతలకు గట్టి సూచన చేశారు.
కాగా, టీడీపీ.. బద్వేలు ఉప ఎన్నికలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తామంటోంది. ఖచ్చితంగా గెలుస్తామని వైసీపీ చెబుతున్నా, గత మెజార్టీని కాస్త తగ్గించగలిగితే చాలన్న భావనలో టీడీపీ వున్నట్లు తెలుస్తోంది. ఇక, బీజేపీ – టీడీపీ కూటమిది ఉనికి కోసం పోరాటం. నిజానికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ఇదొక అద్భుతమైన అవకాశం. కానీ, దాన్ని ఆయన సద్వినియోగం చేసుకునే అవకాశాలు తక్కువే.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో బీజేపీకే ఛాన్స్ ఇచ్చిన జనసేనాని, జనసేన పార్టీని డోలాయమానంలో పడేశారు. బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి పోటీ చేసినా, జనసేన అభ్యర్థి పోటీ చేసినా.. పెద్దగా తేడా వుండకపోవచ్చు. కానీ, పోటీ చేయడం ద్వారా తమ పార్టీ ఉనికిని అయినా జనసేన తెలియజెప్పేందుకు వీలు కలుగుతుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోందంటూ ఇప్పటికే ఘీంకారాలు చేసేసిన జనసేనాని, ఆ పవర్ ఏదో బద్వేలు ఎన్నికలతో చూపిస్తే బావుంటుందేమోనని జనసైనికులు కూడా ఎదురుచూస్తున్నారు.