బాబాయ్ హత్య , పిన్ని ఆత్మహత్య.! ఈ పోలిక ఎంతవరకు సబబు.?

‘హూ కిల్డ్ బాబాయ్..’ అంటూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయమై పదే పదే సోషల్ మీడియాలో ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతూ వస్తుంటుంది. తాజాగా, ‘హూ కిల్డ్ పిన్ని..’ అంటూ స్వర్గీయ ఎన్టీయార్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య వ్యవహారంపై ఓ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది.

వైసీపీ నేత ఒకరు ఈ హ్యాష్ ట్యాగ్‌తో ఉమామహేశ్వరి ఆత్మహత్య వ్యవహారంపై ట్వీటేశారు. కొంత అభ్యంతకరమైన భాషని కూడా ఆయన ప్రయోగించారు. హత్య, ఆత్మ హత్య రెండూ ఒకటేనా.? అన్నది చాలామంది అభిప్రాయం. అయితే, ఇక్కడ ఓ కీలకమైన అంశం దాగి వుంది.

2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. తొలుత గుండెపోటుగా ప్రచారమైన ఆ ఘటన ఆ తర్వాత హత్యగా తేలింది. ఏళ్ళు గడుస్తున్నా ఆ కేసులో దోషులెవరో తేలలేదు. ఇప్పట్లో తేలుతుందన్న నమ్మకమూ లేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంపించేశారంటూ టీడీపీ, టీడీపీనే చంపించిందంటూ వైసీపీ.. పెద్ద ఆరోపణల పర్వమే నడిచింది.

కేసుని సీబీఐ విచారిస్తున్నా, నిజాలు నిగ్గు తేలలేదు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో. రాజకీయాల్లో ఇలాంటివన్నీ సర్వసాధారణమే అనుకోవాలా.? ఏమో, అంతేనేమో.! పరిటాల రవి హత్య కేసులో ఏమీ తేలలేదు. ఆ కేసులో నిందితులు చాలామంది ఆ తర్వాత పలు కారణాలతో ప్రాణాలు కోల్పోయారు.

ఇక, ఉమామహేశ్వరి విషయానికొస్తే ఆమె రాజకీయాల్లో లేరు. కేవలం స్వర్గీయ ఎన్టీయార్ కుమార్తె.. చంద్రబాబ సతీమణి భువనేశ్వరికి సోదరి కావడంతోనే ఆమె మరణంపై రాజకీయ అనుమానాలా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. పదే పదే వైఎస్ జగన్ మీద ‘వెటకారపు’ హ్యాష్ ట్యాగ్స్ ప్రచారంలోకి తెస్తుండడంతో సహజంగానే వైసీపీ శ్రేణులూ అవకాశం కోసం చూస్తాయ్. అలా ‘హూ కిల్డ్ పిన్ని’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చిందన్నమాట.