నెల్లూరు జిల్లాలోని క్రిష్టపట్నం అనే ఓ చిన్న గ్రామం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఆ గ్రామంలో ఓ ఆయుర్వేద మందు లభ్యమవుతోంది. అది కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందన్నది అక్కడి ప్రజల నమ్మకం. మందు తయారు చేస్తోన్న వ్యక్తి, ఏయే మూలికలతో దాన్ని తయారు చేస్తున్నదీ వివరిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి, మందు తాలూకు శాంపిల్స్ తీసుకుని, పరీక్షలు నిర్వహించారు. ఆ మందులో ఎలాంటి చెడు ప్రభావాలు కలిగించే పదార్థాలు లేవని తేల్చారు. అయితే, కరోనా వైరస్ మీద ఈ మందు సరిగ్గా పనిచేస్తుందా.? లేదా.? అన్నదానిపై శాస్త్రీయ ఆధారాలు మాత్రం ఇప్పటిదాకా లభించలేదు. ఎటూ చెడు ప్రభావాలు లేవు గనుక, వాడితే తప్పేముంది.? అన్న భావన జనంలో మరింత పెరుగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ మందు కోసం పోటీలు పడే పరిస్థితి నెలకొంది. నెల్లూరు జిల్లాలోని ఓచిన్న గ్రామమైన క్రిష్టపట్నం వైపుకు రాష్ట్రంలోని నలు మూలల నుంచీ ప్రజలు మందు కోసం వస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతుండడం గమనార్హం.
వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, ఈ మందు పంపిణీకి సహకరిస్తున్నారు. అయితే, సోషల్ డిస్టెన్సింగ్ కనిపించకపోవడంతో కరోనా వ్యాప్తి పెరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మందు తీసుకున్నాక కరోనా భయం పోయిందని చాలామంది చెబుతుండడంతో, ఆ మాటలు విన్న మరికొంతమంది మందు కోసం వెళుతున్నారు. తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామనీ, క్యూ లైన్ల ఏర్పాటుతోపాటు, సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా చర్యలు తీసుకుంటున్నామనీ పోలీసులు చెబుతున్నారు. కరోనా బారిన పడ్డవారికి చికిత్స నిమిత్తం అందిస్తోన్న పలు రకాల మందుల విశ్వసనీయతపై అనుమానాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయుర్వేద మందుపై జనం ఆసక్తి పెంచుకోవడం ఆశ్చర్యకరమే మరి.