బిక్ష..గిక్ష అంటూ ఆయన్ను రెచ్చగొట్టకండి అవంతిగారు

బిక్ష..గిక్ష అంటూ ఆయన్ను రెచ్చగొట్టకండి అవంతిగారు
వైసీపీలో అంతర్గత కలహాలు సద్దుమణగడం లేదు.  రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును లొంగదీసుకోలేకపోయామే అనే అసహనం పార్టీ కీలక నేతల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.  ఢిల్లీ వెళ్లినా, ఎంపీలు అందరినీ పణంగా పెట్టడానికి సిద్దమైనా రామరాజు మీద అనర్హత వేటు వేయించలేకపోయారు.  ఈ పరాభవానికి తోడు ప్రభుత్వం యొక్క ప్రతి చర్యను రఘురామరాజు తప్పుబడుతుండటం, మీడియా మీట్స్ పెట్టిమరీ వార్నింగ్స్ ఇస్తుండటంతో వైసీపీ అగ్రనాయకత్వం ఊపిరి తిప్పుకోలేకపోతోంది.  ఎవరికి వారు సొంతగా రామరాజు మీద తమదైన శైలిలో కౌంటర్స్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. 
 
అలాంటి వారిలో మంత్రి అవంతి శ్రీనివాస్ రావు ముందున్నారు.  మొన్నామధ్య రఘురామరాజు మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకించిన అంశం మీద లేటుగా ఈరోజు స్పందించిన అవంతిగారు ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఊరుకునేది లేదని, అసలు విశాఖ రాజధానిగా ఉండకూడదని చెప్పడానికి నీవెవరు, నీ నరసాపురం సంగత నువ్వు చూసుకో, అన్నిటిలో వేలు పెట్టకండి, విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబుకు పట్టిన పరిస్థితే మీకూ పడుతుంది అంటూ మొదట గంభీరంగా మాట్లాడిన ఆయన చివరికి అసలు పాయింట్ వద్దకే వచ్చి ఆగారు. 
 
వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు  పెట్టిన భిక్షతో ఎంపీగా గెలిచారు.  జగన్ చరీష్మా ఉండబట్టే నాగబాబు మీద గెలవగలిగారు.  మీకు భిక్ష పెట్టిన సీఎంపైనే విమర్శలు చేయడం తగదు అంటూ మాట్లాడారు.  గతంలో కూడా ఇలానే వైసీపీ నేత ఒకరు జగన్ భిక్ష పెడితే గెలిచావ్ అంటూ మాట్లాడబట్టే రఘురామరాజుకు చిర్రెతుకొచ్చింది.  ఎవరి దయతోనూ నేను గెలవలేదు.  నరసాపురం లోక్ సభ పరిధిలోని ఎమ్మెల్యేలు జగన్ బొమ్మతో కాదు నా బొమ్మ పెట్టుకుని గెలిచారు.  అయినా ఎన్నికల ముందు కాళ్లా వేళ్ళా పడితే పార్టీలో చేరాను అంటూ జగన్ చరీష్మాను చులకన చేసేశారు.  అక్కడి నుండే వ్యవహారం ముదిరి ఢిల్లీకి చేరింది.  మళ్లీ ఇప్పుడు అదే తరహాలో అవంతిగారు మీకు బిక్ష పెట్టారు అంటూ రఘురామరాజును రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.  ఈ మాటలకు రామరాజు నుండి తప్పక కౌంటర్ వస్తుంది.  అయితే అది ఏ వైపు నుంచి ఏ మోతాదులో వస్తుందనేదే సస్పెన్స్.