మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ వైసీపీలో చేరడానికి దాదాపు లైన్ క్లియర్ అనే మాట వినిపిస్తోంది. మంచిరోజు చూసుకుని ఆయన తన కుమారుడికి జగన్ చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పించేస్తారనే టాక్ వినబడుతోంది. గంటా వైసీపీలోకి వెళ్లనుండటం టీడీపీని ఆందోళనకు గురిచేస్తుంటే వైసీపీలో అలజడి సృష్టిస్తోంది. గంటాను పార్టీలోకి రానివ్వొద్దని వైసీపీలోని బడా లీడర్లు అడ్డుపడిన సంగతి తెలిసిందే. వారిలో విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాస్ ప్రముఖులు.
అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయే గంటా శ్రీనివాస్ లాబీయింగ్ చేయడంలో కింగ్. ఎక్కడైనా సరే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోగలరు ఆయన. మహా వృక్షం కింద చిన్న చిన్న చెట్లు ఎదగలేవన్నట్టు గంటా ఉన్న చోట మిగతా నేతలు మిన్నకుండిపోవాల్సిందే. అంతలా అధినేతలను తనవైపు తిప్పుకోగలరు గంటా. ఇదే విజయసాయి రెడ్డి, అవంతిలలో కంగారు పుట్టించింది. విజయసాయి అయితే గంటాను పార్టీలోకి రానివ్వకుండా జగన్ వద్ద గట్టి ఏర్పాట్లు చేశారు. కానీ గంటా వైసీపీలో మిగిలిన ముఖ్య నాయకుల వైపు నుండి మంతనాలు జరిపి విజయసాయిని సైతం సైలెంట్ చేశారు.
కానీ అవంతి మాత్రం ఊరుకోవట్లేదు. ఎవరెన్ని చెప్పినా గంటా శ్రీనివాస్ పార్టీలోకి వస్తే సహించేదిలేదని అంటున్నారట. ఒకవేళ తనకు కాదని గంటాను చేరదీస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేసి కేవలం ఎమ్మెల్యేగానే ఉండిపోతానని తేల్చిచెప్పేశారట. ఇలా గంటాను ఆపడానికి మంత్రి పదవిని సైతం పణంగా పెట్టడానికి అవంతి వద్ద పెద్ద రీజన్ ఉంది. అదే విశాఖ మీద ఆధిపత్యం. టీడీపీ అధికారంలో ఉండగా విశాఖ మొత్తం దాదాపుగా గంటా చేతుల్లోనే ఉంది. ఇప్పుడు పవర్ లేకపోయినా ఆయనకున్న పరిచయాలు, నెట్వర్క్ అలానే ఉన్నాయి. ఆయనకు అదనంగా కావాల్సిందల్లా పవర్ పాలిటిక్స్. వైసీపీలో చేరితే అవి దొరికేస్తాయి. అప్పుడు గంటా కిందే మిగతా ఎవరైనా ఉండాల్సి ఉంటుంది. అది అవంతి శ్రీనివాస్ అయినా సరే. అందుకే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ గంటాను పార్టీలోకి రాకుండా అడ్డుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు.