తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది హేమంత్ హత్య. తన కూతురును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఓ తండ్రి చేసిన ఘాతుకం ఇది. ఇలాంటి పరువు హత్యలు దేశంలో రోజూ జరుగుతూనే ఉన్నాయి. జనరేషన్లు మారుతున్నా జనాలు మాత్రం ఇంకా కులాలు, మతాలు, పరువు అంటూ అక్కడే ఆగిపోతున్నారు. పరువు కోసం చంపడానికైనా… చావడానికైనా సిద్ధపడుతున్నారు.
హేమంత్ హత్య కేసులో ఇప్పటికే నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. వాళ్ల తొలిరోజు కస్టడీ ముగిసింది. కస్టడీలో పోలీసుల విచారణలో హత్యకు గల కారణాలను నిందితులు పోలీసులకు తెలిపారు.
మాకు అవంతి ప్రేమ విషయం ముందే తెలుసు. తెలిసి వద్దని వారించాం. అవంతి వినలేదు. మానుంచి తప్పించుకుంది. వెళ్లి హేమంత్ ను ప్రేమ వివాహం చేసుకుంది. కన్న తల్లిదండ్రులను కాదని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. మాకు పోలీసుల నుంచే వాళ్లకు పెళ్లయినట్టు సమాచారం అందింది. పెళ్లి చేసుకొని వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. తను పెళ్లి చేసుకున్నదని తెలియగానే పరువంతా బజారున పడిందనిపించింది. బయట తల ఎలా ఎత్తుకొని తిరగాలో అర్థం కాలేదు. గత 15 ఏళ్ల నుంచి నాకు, నా బామ్మార్థికి మాటలు లేవు. కానీ.. అవంతి చేసిన పని వల్ల మళ్లీ ఇద్దరం కలవాల్సి వచ్చింది. ప్రాణం కన్నా కూడా పరువే ముఖ్యం… అని భావించే కుటుంబం మాది. మా కాలనీలో మా కుటుంబానిదే ఆధిపత్యం. అలాంటి మేము.. అవంతి చేసిన పని వల్ల.. మొత్తం తలదించుకోవాల్సి వచ్చింది. అందుకే.. మా పరువు గంగలో కలిసేలా చేసిన హేమంత్ ను చంపేశాం.. అని అవంతి తండ్రి లక్ష్మారెడ్డి.. పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది.