ఆళ్లగడ్డ టీడీపీ నేతలు భూమా అఖిల ప్రియ-ఏవీ సుబ్బారెడ్డిల మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. ఇటీవలే మరోసారి ఇరువురి మధ్య మాటల యుద్ధం తారా స్థాయిలో జరిగింది. సుబ్బారెడ్డిని హత్య చేయడానికి అఖిల ప్రియ కోటి రూపాయలు సుఫారీ ఇచ్చిందని ఆరోపణ నేపథ్యంలో ఆ వ్యాఖ్యల్ని అఖిల ప్రియ ఖండించిన సంగతి తెలిసిందే. అటుపై కోర్టు విచారణలకు అఖిల ప్రియ గౌర్హాజరవ్వడం వంటి సన్నివేశాలపై కోర్టు సీరియస్ అయింది. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేయడం జరిగింది.
తాజాగా సుబ్బారెడ్డి మరోసారి తన కుటుంబానికి అఖిల ప్రియ నుంచి ప్రాణ హాని ఉందని వెంటనే ఆమెను అరెస్ట్ చేయాలని కుమార్తె జస్వంతి తో కలిసి జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేసారు. ఏ4 అయిన అఖిల ప్రియని ఇప్పటివరకూ ఎందుకు అరెస్ట్ చేయాలేదని మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఏ 1 నుంచి ఏ 4 వరకూ అందర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు..ఆమెను ఎందుకు వదిలేసారో? చెప్పాలని డిమాండ్ చేసారు. భూమా ఫ్యామిలీ తనని చంపడానికి సుపారీ ఇచ్చిన మాట నిజం కాదా? అని మండిపడ్డారు. కోర్టు నోటీసులిచ్చినా అఖిల ప్రియ, ఆమె భర్త పట్టించుకోకుండా..ధర్జాగా బయట తిరుగుతున్నారన్నారు.
ముందస్తు బెయిల్ దొరికితే పోలీసులు చేసేది కూడా ఏమీ ఉండదన్నారు. అదే జరిగితే మళ్లీ తనపై దాడి చేసే అవకాశం ఉందని..అఖిల ప్రియ మహిళా ముసుగులో హత్యా రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఆళ్లగడ్డలో రాజకీయంగా తనని ఎదుర్కోలేక ఇలా హత్యలకు తెరలేపుతున్నారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. వీలైంనత త్వరలో అఖిలప్రియను అరెస్ట్ చేయకపోతే ఆళ్లగడ్డలో పరిస్థితులు మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.