ప్రస్తుత కాలంలో యువతీ యువకులు సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేక ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య మార్గమని భావించి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇటీవల కృష్ణా జిల్లాలో కూడా ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. పిన్ని ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు యువకుడిని పోలీస్ స్టేషన్ కి పిలిపించి దారుణంగా కొట్టి, హింసించడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలలోకి వెళితే….కృష్ణాజిల్లా కంకిపాడులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కంకిపాడు చెందిన రాజులపాటి అరవింద్ (25) అనే యువకుడు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ అన్వేషణలో బెంగళూరులో ఉంటున్నాడు. అరవింద్ తల్లిదండ్రులు కంకిపాడులో నివాసం ఉంటున్నారు. కంకిపాడు పోలీసుస్టేషన్‌కు ఎదురుగా ఉన్న ఇళ్ళల్లో అరవింద్ తల్లిదండ్రులతోపాటు అతని పిన్ని బాబాయ్ కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. చాలాకాలంగా వీరి కుటుంబాల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి.
ఈ క్రమంలో ఇటీవల కూడా అరవింద్ తల్లికి అతని పిన్నితో గొడవ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అరవింద్ తన పిన్నికి సంబంధించిన ఫోన్ కాల్ రికార్డులను తన పిన్ని కొడుకుకి పంపించాడు. ఈ రికార్డింగ్స్ విని అరవింద్ పిన్ని కొడుకు ఆమెను నిలదీశాడు. దీంతో చాలా కాలంగా అరవింద్ వాయిస్ రికార్డులతో తనని బెదిరిస్తున్నాడని అరవింద్ పిన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అరవింద్ విచారణకు పిలిపించి దారుణంగా కొట్టి హింసించారు. ఈ క్రమంలో పోలీసుల ప్రవర్తనతో మనస్థాపానికి గురైన అరవింద్ శుక్రవారం తమ నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అరవింద్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా అరవింద రాసిన సూసైడ్ లెటర్ లభ్యం అయింది. అరవింద్ రాసిన లెటర్ లో..” కొన్నేళ్లుగా పిన్ని మా కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పెడుతోంది. ఎంతోకాలంగా నేను ఆమెతో మాట్లాడటం లేదు అలాంటిది ఆమెను ఎలా వేధిస్తాను. నా వద్ద ఉన్న వాయిస్ రికార్డులను తమ్ముడికి పంపితే తల్లిని మార్చుకుంటాడని భావించి ఆ పని చేశా.ఇక నన్ను విచారణకు పిలిపించి ఒక కానిస్టేబుల్ కొట్టిన దెబ్బలు, తిట్టిన బూతులకు నాకు బతకాలనే ఆశ చచ్చిపోయింది. నా చావుకు కారణం, మా పిన్ని, కానిస్టేబుల్’ అని రాశాడు. చేతికందిన కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకుని మరణించడంతో తోటి కోడలి మీద, పోలీసు కానిస్టేబుల్ మీద కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.