ఎట్టకేలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడి నియామకం పూర్తైపోయింది. దీంతో ఆయన అభిమానులు, సామాజిక వర్గంవారు చంద్రబాబు నాయుడును తెగపొగిడేస్తున్నారు. అచ్చెన్న సైతం తన మీద నమ్మకముంచి పదవి ఇచ్చినందుకు బాబును ముఖ్యమంత్రిని చేసి తీరురానని శపథం బూనారు. కానీ అచ్చెన్నను అధ్యక్షుడిని చేయడం వెనుక చంద్రబాబు నాయుడి ఆలోచనలను ప్రభావితం చేసిన వ్యక్తి మాత్రం వైఎస్ జగన్ అనే అనాలి. ఒక్క చంద్రబాబే కాదు రాష్ట్రం మొత్తం అచ్చెన్నాయుడి వైపు చూసేలా చేసింది జగనే. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు మీద ప్రధాన ఆరోపణలు చేస్తూ ఆయన అరెస్ట్ చేశారు. అదే ఆయన ఇమేజ్ ను అమాంతం పెంచింది.
అప్పటివరకు అచ్చెన్నాయుడు అంటే టీడీపీలో ఒక యాక్టివ్ పొలిటీషియన్, ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కుంటారు అనే ఫీడ్ బ్యాక్ మాత్రమే ఉండేది. కానీ అరెస్ట్ తర్వాత ఆయనకు స్టార్ స్టేటస్ వచ్చేసింది. టెక్కలి నియోజకవర్గానికి, శ్రీకాకుళం టీడీపీ శ్రేణులకు మాత్రమే పరిమితమైన ఆయన ప్రభావం మొత్తం రాష్ట్ర టీడీపీ మీద పడింది. అసలు అచ్చెన్నాయుడును తెల్లవారుఘామున భారీ మందీమార్భలంతో వెళ్లి అరెస్ట్ చేయడంతోనే సీన్ రక్తికట్టేసింది. అక్కడి నుండి ఆయన్ను ఆంరోగ్యాంగా ఉన్నా సరే రోడ్డు మార్గాన తిప్పడం, ఆయన ఆయన ఆరోగ్యం క్షీణించడం, వైసీపీ నేతలంతా మూకుమ్మడిగా అచ్చెన్నాయుడు దొంగ అంటూ గోల గోల చేయడం, ఆ తర్వాత ఆయనకు కరోనా సోకడం చివరికి బెయిల్ దొరకడం ఇలా ఆయన అరెస్ట్ నుండి విడుదల వరకు అన్నీ సూపర్ హిట్ ఎపిసోడ్లే.
వీటితో ఒక రెండు నెలలు అన్ని మీడియా సంస్థల్లో అచ్చెన్నాయుడు పేరే మారుమోగిపోయింది. రిమాండ్లో ఉన్నన్ని రోజులు ఆయన మీద సానుభూతి క్రియేట్ కాగా బెయిల్ మీద విడుదలయ్యేసరికి అది కాస్తా హీరోయిక్ ఇమేజ్ టర్న్ తీసుకుంది. జగన్ స్థాయి వ్యక్తి అచ్చెన్నాయుడు మీద ఇంతలా గురిపెట్టాడేమిటి, అంటే ఆయనలో ఏదో విషయం ఉంది, ఆయన మామూలోడు కాదు అనుకునే స్థాయికి సామాన్య జనం వెళ్లిపోయారు. ఇంత పాపులారిటీ వచ్చాక చంద్రబాబు ఊరుకుంటారా చెప్పండి. అందుకే ఆయనకు అధ్యక్ష పదవి కట్టబెట్టారు. అంతకుముందే జగన్ బీసీ నాయకుడైన అచ్చెన్నాయుడును అకారణంగా అరెస్ట్ చేసి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారనే ప్రచారం ఎలాగూ జరిగిపోయింది కాబట్టి బీసీలను ఇంకాస్త ఆకట్టుకోవడానికి అధ్యక్ష పదవి ఇచ్చేశారు చంద్రభాబు. అలా రెండు మూడు నెలలు జరిగిన హైడ్రామాతో అచ్చెన్నాయుడు లెవల్ పూర్తిగా మారిపోయింది. ఇందులో మెజారిటీ క్రెడిట్ మాత్రం వైఎస్ జగన్‌దే. కనుక అచ్చెన్నాయుడు జగన్‌కు చాలా రుణపడిపోయారనే అనుకోవాలి.