మన తెలుగు రాజకీయ పార్టీల్లో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువఅనడానికి లేదు. దొందూ దొందే అనే రీతిలో పోటీపడుతున్నాయి టీడీపీ, వైసీపీలు. పాలసీలను ప్రశ్నించడం ఎప్పుడో మానుకుని వ్యక్తిగత్య విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఏదో గొప్పగా చేసేశాం అనుకుంటున్నారు ఇరు పార్టీల నేతలు. వ్యక్తిగత విమర్శలంటే మళ్ళీ పెద్ద పెద్ద రహస్యాలు అనుకునేరు. కేవలం మాట్లాడే మాటల్లో తప్పిదాలు వెతికి పట్టుకోవడమే. నిజానికి ఈ పద్దతికి తెరతీసింది వైసీపీని. నారా లోకేష్ మీద ఎలా నెగెటివిటీ పుట్టించాలో తెలియని వైసీపీ నేతలు ఆయన భాషా పరిజ్ఞానం మీద దాడి చేశారు.
సభల్లో, సమావేశాల్లో ఆయన మాట్లాడే మాటల్లో వ్యాకరణ, ఉఛ్ఛరణ దోషాలు వెతుక్కుని వాటినే హైలెట్ చేస్తూ కనీసం తెలుగు కూడ మాట్లాడటం రాని లోకేష్ తెలుగుదేశం పార్టీకి సారథి అవుతాడా అంటూ పప్పు అనే మారుపేరును తగిలించారు. దాన్ని పట్టుకునే ఆయన మీద బోలెడంత నెగెటివిటీ సృష్టించి ఆయనకేమీ రాదనే ముద్ర వేశారు. నిజానికి లోకేష్ మీద ఏపీ ఫైబర్ స్కామ్ లాంటి పలు ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఇప్పటికీ ఒక్కదాన్ని కూడ నిరూపించలేకపోయారు. కానీ ఆయన తెలుగు బాగుండదనీ, ఆయనకు ట్రాక్టర్ తోలడం రాదని మాత్రం బాగా గోల గోల చేశారు. వాళ్ళే అనుకుంటే ఇప్పుడు టీడీపీ కూడ అదే బాట పట్టింది.
తాజాగా సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ అవతారం దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడారు. మధ్యలో కొన్ని కొన్ని తెలుగు పదాలను పలకలేక ఇబ్బందిపడ్డారు. తల్లడిల్లిన అనే పదాన్ని తల్లడిన్న, స్వావలంభనను స్వాలంబన, అక్కచెల్లమ్మలను అక్కచెమ్మలు, టీవీని ఠీవి అంటూ పలికారు. నిజానికి ఈ భాషా దోషాల మూలాన రాష్ట్రానికి, ప్రజలకు వచ్చే నష్టం ఏమీ లేదు. పైగా జగన్ మాటల సారంశంలో నూటికి నూరుశాతం నిజముంది. అందుకే ఆయన ఉద్దేశ్యాలను తప్పుబట్టలేకపోయిన టీడీపీ లీడర్లు, ఎల్లో మీడియా ఆ స్పెల్లింగ్ మిస్టేకులను పట్టుకుని హైలెట్ చేస్తున్నారు.
చివరికి గౌరవప్రదమైన పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్న అచ్చెన్నాయుడు కూడ వాటినే ఎడిటింగ్ చేసి వీడియోగా చేయించుకుని ఏం భాష స్వామీ అది అంటూ ఎద్దేవా చేశారు. పదవికున్న పెద్దరికానికే మచ్చ తెచ్చారు. ఆయనకంటే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ మేలు. జగన్ సర్కార్ లెక్కల అప్పుల చిట్టాను చదువుతూ ఓటర్లకు ఉపయోగపడే సమాచారం ఇస్తుంటారు. మన లీడర్లు, ప్రజాప్రతినిధులు విధానపరమైన విమర్శలు చేయడం ఇంకెప్పుడు నేర్చుకుంటారో.