పొలిటికల్ ‘కొట్టుడు’.. టీడీపీలోనే ఎందుకు.?

ashok-gajapathi-raju
ashok-gajapathi-raju
ashok-gajapathi-raju

బాలయ్య చేతికి దురదెక్కువన్న విమర్శలున్నాయి. అదెంత నిజం.? అన్నది పక్కన పెడితే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ.. ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నా, అభిమానుల మీద చెయ్యి చేసుకోవడం మానలేకపోతున్నారు. బాలయ్య ఎక్కడికన్నా వెళితే, ఎవడో ఒకడి చెంప పగిలిపోవాల్సిందే. ఎందుకిలా.? అంటే, ఆయన ఫ్రస్ట్రేషన్ అలాంటిది. చంద్రబాబులో కూడా ఈ మధ్య అసహనం పెరిగిపోయింది. ఎన్నికల ప్రచారానికి వెళ్ళి ఓటర్లను అవమానిస్తున్నారు.. బెదిరింపులకు దిగుతున్నారు.. హెచ్చరిస్తున్నారు. ఓట్లను అమ్మేసుకుంటున్నారంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. చూస్తంటో, బాబుగారు కూడా రేపో మాపో ఎవరో ఒకరి చెంప పగలగొట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

మరోపక్క, టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కూడా చెయ్యి విదిలించేశారు.. అందునా ఓ మహిళా కార్యకర్త మీద. ‘పువ్వులు జల్లే క్రమంలో ఆ మహిళా కార్యకర్త చూపిన అత్యుత్సాహం కాస్తా, అశోక్ గజపతిరాజుగారికి ఇబ్బంది కలిగించింది. క్షణికావేశంలో, బాధతో.. రాజుగారు ఆమెపై చెయ్యి చేసుకున్నారు..’ అన్నది టీడీపీ అనుకూల మీడియా ‘కవరింగ్’. అయితే, అక్కడ.. ఆ ఘటన జరిగిన సమయంలో వున్నవారేమో.. ‘స్థానికంగా తన ప్రాబల్యం తగ్గిపోవడం.. పార్టీలో లుకలుకల నేపథ్యంలో అశోక్ గజపతిరాజుకి అసహనం పెరిగిపోయింది. అదిలా బయటకొచ్చింది..’ అంటున్నారు. ఏది నిజం.? అన్నది వేరే చర్చ. కానీ, టీడీపీ నేతల్లో అసహనం పెరిగిపోయింది. ఎంపీ కేశినేని నాని కాళ్ళు విరగ్గొట్టేస్తానని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అనడాన్ని ఎలా తేలిగ్గా తీసుకోగలం.? వైసీపీ నేతలు, టీడీపీని తిట్టడం మామూలే. కానీ, టీడీపీ నేతలే.. తమలో తాము కొట్టుకునే పరిస్థితి వచ్చింది. కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు.. సాటి నేతల మీద గొడవలకు వెళ్ళిపోతున్నారు. టీడీపీ భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైపోవడమే ఈ దుస్థితికి కారణమే. అయినా, అధినేతలోనే ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతే.. ఇతర నేతలు ఇంకెలా వుంటారు.?