నారా లోకేష్ పాదయాత్ర.! 2024 ఎన్నికలే లక్ష్యం.!

పాదయాత్రల ట్రెండ్ రాజకీయాల్లో కొనసాగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత నారా చంద్రబాబునాయుడు.. ఆ క్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల.. బండి సంజయ్.. రాహుల్ గాంధీ.. ఇలా రాజకీయ ప్రముఖులు పాదయాత్రలతో రాజకీయాల్లో తమదైన ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నించారు.. కొందరు ప్రయత్నిస్తున్నారు.. ఆ ట్రెండ్‌ని మరికొంతమంది ఫాలో అవుతున్నారు కూడా.!

తాజాగా, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. చిత్తూరు జిల్లా నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కాబోతోందిట. వేల కిలోమీటర్ల పాదయాత్ర లక్ష్యం.! దాదాపు అన్ని నియోజకవర్గాల్నీ కవర్ చేయబోతున్నారు. అయితే, వేగంగా.. పాదయాత్ర జరిగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

పాదయాత్రలు చేసినోళ్ళంతా అధికార పీఠమెక్కేస్తారా.? అంటే, ఇప్పటిదాకా పాదయాత్రలు బాగానే వర్కవుట్ అయ్యాయి.. ఒక్క షర్మిలకు తప్ప. గతంలో ఆమె తన అన్న వైఎస్ జగన్ కోసం పాదయాత్ర చేశారు. ఇప్పుడు తన కోసం పాదయాత్ర చేస్తున్నారు తెలంగాణలో. వైఎస్ షర్మిల తెలంగాణలో అధికార పీఠమెక్కలేకపోతే, పాదయాత్రలతో అధికారం వస్తుందన్న సెంటిమెంటుకి బ్రేక్ పడుతుంది.

ఇదిలా వుంటే, పాదయాత్ర కోసం నారా లోకేష్ ఇప్పటికే పూర్తిస్థాయి ఫిట్నెస్ సంపాదించుకున్నారట. ఒకప్పుడు కాస్త బొద్దుగా వుండే లోకేష్ ఈ మధ్య బాగా సన్నబడ్డారు. రెగ్యులర్ వర్కవుట్లు కూడా చేస్తున్నారట. అంతే కాదు, ప్రసంగాల్లోనూ పదును పెంచారు. ప్రత్యేకంగా ప్రసంగాల విషయమై శిక్షణ కూడా తీసుకుంటున్నారట.

తప్పదు.. అన్నీ చేయాల్సిందే. పాదయాత్రలంటే ఒకప్పటిలా కాదు. ఇప్పుడు సీన్ మారింది. జనాన్ని సమీకరించడం దగ్గర్నుంచి చాలా వ్యవహారాలుంటాయ్. జనాన్ని ఆకట్టుకునేలా మాట్లాడాలి, వారిని దగ్గర చేసుకోవాలి.. ఇవన్నీ నారా లోకేష్ చేయగలరా.? అన్నది ప్రస్తుతానికైతే మిలియన్ డాలర్ ప్రశ్నే.