రాష్ట్రాల సరిహద్దుల్లో అంబులెన్సుల్ని ఆపడమేంటి.? ఒక్క నిమిషం ఆలస్యమైతేనే ప్రాణాలు పోతాయ్.. అనుకున్నవాళ్ళే అంబులెన్సుల్ని ఆశ్రయిస్తారు. ఆమాత్రం మానవత్వం లేకుండా ఎలా తెలంగాణ ప్రభుత్వం సరిహద్దుల్లో అంబులెన్సుల్ని ఆపేందుకు నిర్ణయాలు తీసుకుంది.? చిన్న పిల్లాడికి సైతం వచ్చే అనుమానాలివి. కానీ, ప్రభుత్వ పెద్దలు అవేమీ ఆలోచించలేదు. అధికారం తమ చేతుల్లో వుంది గనుక.. నిర్ణయం తీసేసుకున్నారు. కోర్టు గతంలోనే తప్పు పట్టినా వెనక్కి తగ్గలేదు. ఇంకో దారిలో పాత నిర్ణయాన్నే అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఈసారి మొట్టికాయ గట్టిగా పడింది హైకోర్టు నుంచి. మీకు ఆ అధికారం ఎవరిచ్చారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించడం గమనార్హం.
తెలంగాణలోని ఆసుపత్రుల్లో బెడ్ కన్ఫర్మేషన్ చేసుకుని, కాల్ సెంటర్ ద్వారా, అలాగే ఈ పాస్ పొంది.. ఇన్ని చేసి, ఓ ప్రాణాన్ని నిలబెట్టుకోవాల్సిన దుస్థితి.. అంటే, రోగిదీ, రోగి కుటుంబ సభ్యులదీ ఎంతటి దారుణమైన పరిస్థితి.? ఓ మనిషిగా ఎవరైనా ఆలోచిస్తే, కడుపు తరుక్కుపోతుంటుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం చాలా తేలిగ్గా నిర్ణయం తీసుకుంది. పైగా, ఇలాంటి విషయాల్లో మానవీయ కోణంలో ఆలోచించే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పడిలా తన ప్రభుత్వం ద్వారా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టి పారేసింది. దాంతో, ఇది నిజంగానే చాలా పెద్ద మొట్టికాయ.. దీన్ని చెంపదెబ్బ అనాలా.? ఇంకేమన్నా అనాలా.? న్యాయస్థానాల్లో ప్రభుత్వాలకి ఎదురుదెబ్బలు తగలడం కొత్తమీ కాదు. కానీ, ఇది కాస్త భిన్నమైనది. అసలే కరోనా కాలమిది.. ప్రభుత్వ పెద్దలు మానవీయ కోణంలో వ్యవహరిస్తే.. పాలకులుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. అయినా, మొదటి వేవ్ సమయంలో లేని ఈ తరహా ఆంక్షలు ఇప్పుడెందుకు.?