ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఒక మినీ యుద్ధాన్నే తలపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీ లో వ్యవహరిస్తున్న తీరు పట్ల అధికార పక్షము మరియు స్పీకర్ తీవ్ర అసంతృప్తి తో ఉండటంతో ఏ క్షణమైన చంద్రబాబు నాయుడు మీద అసెంబ్లీ సాక్షిగా క్రమశిక్షణ ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉండనే మాటలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాశం అవుతున్నాయి.
ప్రతిపక్షములో పట్టుమంది పదిహేను మంది లేకపోయిన కానీ, మొదటి రెండు రోజులు అసెంబ్లీ లో చేయాల్సిన రచ్చ చేసేసి, సస్పెండ్ అవుతూ వచ్చారు టీడీపీ సభ్యులు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేని విధంగా దూకుడు చూపిస్తూ, స్పీకర్ పోడియంలోకి వెళ్లి నిరసనలు తెలపటం, ఏకంగా స్పీకర్ కు వేలు చూపిస్తూ నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడటం, సహనం కోల్పోయి ఆవేశంగా ఊగిపోవటం , అధికార పార్టీ మంత్రులను, సీఎం ను ఏక వచనంతో సంబోదించటం లాంటివి అనేకం జరిగాయి.
ఈ పరిణామాలతో అధికారపక్షము చంద్రబాబు నాయుడు మీద చర్యలు తీసుకోవాలని ఏపి అసెంబ్లీలో అధికారపక్షం తీర్మానం చేసింది. అసెంబ్లీలో చంద్రబాబు వైఖరిని ఖండిస్తూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ అధికార పక్షం ఆరోపించింది. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలన్న తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. సభ్యుల తీర్మానాన్ని పరిశీలనలోకి తీసుకుంటున్నామనీ, సరైన సమయంలో సరైన నిర్ణయం, చర్యలు తీసుకుంటామని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.
ఇక మరో మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి, ఈ సమావేశాల్లో కూడా చంద్రబాబు ఇదే రీతిన వ్యవహరిస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష నేత మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా మీద అసెంబ్లీ క్రమశిక్షణ చర్యలు కింద ఆమెను ఒక ఏడాది అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయటం జరిగింది. ఒక వేళ బాబు మీద కూడా దానినే ప్రయోగించవచ్చేమో..?