డీఎంకే విజయానికి అదనపు బలం ఇవేనా ?

తమిళనాడులో ఈసారి స్టాలిన్‌కు సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఆయనదే విజయం అని అన్ని సర్వేలూ తేల్చేశాయి. డీఎంకే కూటమికే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నాయి. కూటమిలోని పార్టీలకు సీట్లు సర్దుబాటు చేసుకుని స్టాలిన్ తలనొప్పులు లేకుండా చూసుకోగలిగారు. ఒకవైపు ప్రత్యర్థి అన్నాడీఎంకే కూటమిని చూసుకుంటే డీఎంకే విజయం ఖాయమన్నది దాదాపుగా అందరికీ తెలిసిపోయిందే.

MK Stalin

సింగిల్ గానే డీఎంకే అధికారానికి కావాల్సిన స్థానాలను సాధిస్తుందన్న అంచనాలు కూడావినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టాలిన్ హామీలు పార్టీ విజయానికి మరింత ఉపకరిస్తాయని అంటున్నారు. స్టాలిన్ ఇటీవల మేనిఫెస్టో విడుదల చేశారు. ఇందులో ప్రజలకు అనేక వాగ్దానాలను ఇచ్చారు. సహజంగా తమిళనాడు అంటేనే ఉచిత హామీలు అనేకం ఉంటాయి. జయలలిత, కరుణానిధి హయాం నుంచే ఈ ఉచిత పథకాలు అమలవుతున్నాయి. స్టాలిన్ కూడా అదే సంప్రదాయన్ని కొనసాగిస్తూ హామీల వర్షం కురిపించారు.

ప్రధానంగా ఇప్పుడు పెట్రోలు ధరలు విపరీతంగా పెరిగాయి. పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో స్టాలిన్ పెట్రోలు లీటర్ పై ఐదు రూపాయలు, డీజిల్‌పై నాలుగు రూపాయలు తాను అధికారంలోకి వస్తే తగ్గిస్తానని చెప్పడం ప్రజలను ఆకర్షించే విధంగా ఉంది. ఇక గ్యాస్ సిలిండర్ పైనా వంద రూపాయలు సబ్సిడీని స్టాలిన్ ప్రకటించారు. దీంతో ప్రత్యర్థిగా ఉన్న అన్నాడీఎంకే కూటమిని స్టాలిన్ ఇరకాటంలో పెట్టినట్లయింది.