సంక్షేమ పథకాల్ని అమలు చేయడం నేరంగా భావిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నానా రకాల విమర్శలూ కనిపిస్తున్నాయి కొన్ని మీడియా సంస్థల్లో. ప్రతిపక్షం ఎప్పుడూ అధికార పార్టీ చేసే కార్యక్రమాల్ని అభినందించదు.. గడచిన దశాబ్దకాలంలో రాజకీయం మరింత పతన స్థాయికి దిగజారిపోయిన విషయం విదితమే.
ఎవరు అధికారంలో వున్నా, విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సింది.. విపక్షంలో ఎవరున్నా అధికార పార్టీపై విరుచుకుపడాల్సిందే. అన్నటికీ మించి, ఎవరు అధికారంలో వున్నా.. సంక్షేమంపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి తీరాల్సిందే. ఎందుకంటే, సంక్షేమమే ఓటు బ్యాంకుగా మారిపోయిందిప్పుడు. డెవలప్మెంట్ అనేది చిన్న విషయంగా కనిపిస్తోంది ఓటర్లకి కూడా. అందుకేనేమో, రాజకీయ పార్టీలు ఆ సంక్షేమంలో జనాన్ని ముంచేస్తున్నాయి. ఇందులో తప్పెవరిది.? అని ఒకర్నే నిందిస్తే సరిపోదు.
కరోనా నేపథ్యంలో డెవలప్మెంట్ అనే మాటకు అర్థమే లేదు. ఏడు పదుల స్వాతంత్ర్య భారతం.. ఇంకా అభివృద్ధి చెందుతూనే వుందని చెప్పుకోవడం హాస్యాస్పదం కాక మరేమిటి.? కరోనా దెబ్బకి.. మన ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమి ఏంటన్నది బయటపడింది. ఆక్సిజన్ కోసం చిన్న దేశాల మీద కూడా ఆధారపడాల్సి వచ్చింది. ఇదీ మన అభివృద్ధి. నిందించడమంటూ చేస్తే.. అందర్నీ నిందించాల్సిందే. కేంద్రం కూడా ఉచిత పథకాల విషయంలో అస్సలేమాత్రం తగ్గడంలేదు.
అలాంటప్పుడు రాష్ట్రాలెందుకు తగ్గుతాయి.? కొందరి పొట్టకొట్టి, ఇంకొందరిని సంక్షేమంలో ముంచేస్తున్న పాలన మన దేశంలో కనిపిస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతున్నట్లే సంక్షేమం ఏపీలో కూడా జరుగుతోంది. కాకపోతే, ఇంకాస్త ఎక్కువ అంతే. కానీ, సంక్షేమమే నేరమన్నట్టు.. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని బూచిగా చూపే ప్రయత్నం అత్యంత హేయం. రాజకీయమే అంత.. ఆ రాజకీయంలో మీడియా కూడా భాగమైపోయిందంతే.