కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటుతోంది. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఇంకొన్ని రాష్ట్రాలు సినిమా హాళ్లను మూసివేస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో కూడ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో స్కూళ్ళు మూతబడ్డాయి. ఆన్ లైన్ క్లాసులు నడుస్తున్నాయి. మెల్లగా నిబంధనలు పెంచాలనే యోచనలో ఉన్నాయి ప్రభుత్వాలు. అందుకే మొదటగా సినిమా థియేటర్ల మీద ఆంక్షలు పడే అవకాశం కనిపిస్తోంది.
సినిమా హాళ్లను పూర్తిగా మూసివేయకపోయినా 50 శాతం ఆక్యుపెన్సీకి కుదించడం ఖాయమని తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీన ఈ నిబంధన అమలులోకి రావచ్చని అంటున్నారు. ఇది 30వ తేదీ వరకు కొనసాగవచ్చు. అవసరం అయితే ఆ తర్వాత ఇంకొన్ని రోజులు పొడిగించం లేదా కేసులు కంట్రోల్ కాకపోతే పూర్తిగా మూసివేసినా ఆశ్చర్యం లేదు. ఈ అనుమానాలతో ఈ నెలలో రావాల్సిన సినిమా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే నాగ చైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ వాయిదాపడగా త్వరలో ‘టక్ జగదీష్, సీటీమార్, విరాటపర్వం’ సినిమాలు కూడ విడుదల తేదీలను మార్చుకునే అవకాశం కనిపిస్తోంది.