ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై మళ్ళీ అదే పబ్లిసిటీ స్టంట్.?

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశంపై మరోమారు రాజకీయ వర్గాల్లో రచ్చ షురూ అయ్యింది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం త్వరలో జరగనుండగా, ఈ సమావేశంలోనే కేంద్రాన్ని ప్రత్యేక హోదాపై నిలదీయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారన్న ప్రచారంతో ప్రత్యేక హోదా కాక రేగింది.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయే సమయంలో, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. మన్మోహన్ సర్కార్ ఐదేళ్ళ ప్రత్యేక హోదా ప్రకటిస్తే, దాన్ని పదేళ్ళకు పెంచుతామని అప్పటి బీజేపీ నినదించింది.

ఐదేళ్ళు, పదేళ్ళు కాదు.. పదిహేనేళ్ళు కావాలనే డిమాండ్ కూడా తెరపైకొచ్చింది. కాలక్రమంలో ఆ ప్రత్యేక హోదాని కాలగర్భంలో కలిపేసింది బీజేపీ. కేవలం అప్పటి రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక హోదా డిమాండ్ తెరపైకి తెచ్చి, అంతలోనే దానికి పాతరేసెయ్యడం బీజేపీకే చెల్లింది.

అయితే, అప్పట్లో బీజేపీకి వంత పాడిన టీడీపీ, ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం పోరాటమంటూ డ్రామాలాడిన విషయం విదితమే. అంతకు మించి వైసీపీ నుంచి కూడా ప్రత్యేక హోదాపై పొలిటికల్ డ్రామాలు నడిచాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత హోదాలో ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేశారు.

కానీ, ఏమయ్యింది ఆనాటి ఆ పట్టుదల.? ప్రత్యేక హోదా కోసం ఇప్పుడెందుకు వైఎస్ జగన్ నిరాహార దీక్ష చేయలేకపోతున్నారు.? వైసీపీ ఎంపీలెందుకు పార్లమెంటు సాక్షిగా పోరాడలేకపోతున్నారు.? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలేమీ కావు.

ప్రత్యేక హోదా అంటే, అది కేవలం ఎన్నికల స్టంటు మాత్రమే.. అధికారం కోసం మాత్రమే. బీజేపీ అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా.. అందరూ పాడేది ఆ పల్లవే… ఆ ఎన్నికల రాజకీయం కోసమే.