స్వర్ణా ప్యాలస్ అగ్ని ప్రమాద అంశం రోజుకో మలుపు తిరుగుతుంది. స్వర్ణా ప్యాలస్ ను అద్దెకు తీసుకొని రమేష్ హాస్పిటల్ దాన్ని కోవిడ్ సెంటర్ గా మార్చారు. అయితే దురదృష్టవశాత్తు అక్కడ అగ్ని ప్రమాదం జరగడం వల్ల అక్కడ చికిత్స పొందుతున్న 10 మృతి చెందారు.
అయితే ఈ ప్రమాదానికి హాస్పిటల్ యాజమాన్యం యొక్క నిర్లక్షమే కారణమని అధికారులు తెలుపుతున్నారు. అలాగే అనుమతికి మించి కరోనా బాధితులకు చికిత్స చేశారని కూడా అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ విషయంపై హీరో రామ్ పోతినేని కూడా స్పందించి మరో వివాదాన్ని సృష్టించారు. హోటల్ యాజమాన్యం చేసిన తప్పుకు వైద్యులను బాధ్యులను చేయడం తగదని, ఈ విషయాన్ని కొందరు నాయకులు కావాలనే కులం వైపు తీసుకెళ్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన అధికారులు రామ్ విచారణకు అడ్డుపడితే నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.
అయితే ఇప్పుడు కేసులో మరో పెద్ద కంపెనీ బయట పడింది. అగ్నిప్రమాదం ఘటనపై విచారణ జరిపిన దర్యాఫ్తు బృందం 4 పేజీల రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసింది. ఈ కేసు దర్యాఫ్తులో భాగంగా రమేష్ హాస్పిటల్ లో 51% వాటా ఉన్న ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు.
దుబాయ్ కేంద్రంగా ఆస్టర్ కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. కేరళకు చెందిన డాక్టర్ అజాద్ మూపెన్ 1987లో ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ సంస్థను స్థాపించారు. ఇక రమేష్ హాస్పిటల్స్ లో 51 శాతం వాటా కింద ఆస్టర్ సుమారు రూ. 250 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఒంగోలు గుంటూరు విజయవాడలోని పలు హాస్పిటల్స్ లో కూడా ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ సంస్థకు వాటాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రమేష్ హాస్పిటల్స్ వాటాదారైన ‘ఆస్టర్’ సంస్థకు కూడా నోటీసులు జారీ చేసి వివరాలు సేకరిస్తామని ఏసీపీ సూర్యచంద్రరావు వెల్లడించారు.