ఏపీ మంత్రుల బస్సు యాత్ర.! ఇదో కొత్త ఒరవడి

AP Ministers : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రులు సామాజిక న్యాయం పేరుతో బస్సు యాత్ర చేయబోతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సు యాత్ర మూడు లేదా నాలుగు రోజులపాటు సాగే అవకాశం వుంది. ఈ విషయాన్ని బీసీ, దళిత, మైనార్టీ మంత్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియజేశారట. ముఖ్యమంత్రి నుంచి ఆమోద ముద్ర కూడా పడిందట.

వావ్.! అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్.? వస్తున్నాయ్ కదా.! బీసీ మంత్రులు,  ఎస్సీ మంత్రులు, మైనార్టీ మంత్రులు.. ఇలా విభజించి చూడటం ఎంతవరకు సబబు.? అన్నది సామాన్యుల నుంచి దూసుకొస్తున్న ప్రశ్న. అయితే, అనాదిగా ఆయా వర్గాలకు పదవుల విషయంలో అన్యాయం జరుగుతోందనీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయా వర్గాలకు పదవులు ఇస్తున్నారనీ వైసీపీ అంటోంది.

నిన్నటికి నిన్న రాజ్యసభకు సంబంధించి నాలుగు సీట్ల కోసం వైసీపీ అభ్యర్థులు ఖరారైన విషయం విదితమే. రెండు బీసీలకు, రెండు రెడ్డి సామాజిక వర్గానికీ కేటాయించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇంతకీ, దళిత అభ్యర్థుల మాటేమిటి.? దళితుల్లో రాజ్యసభకు వెళ్ళేంత ‘స్థాయి’ వైసీపీలో ఎవరికీ లేదా.? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది.
రెండు సీట్లు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకున్న వైఎస్ జగన్, అందులో ఒకటి తగ్గించి.. దాన్ని దళిత సామాజిక వర్గానికి కేటాయిస్తే బావుండునన్న చర్చ వైసీపీ వర్గాలలోనే జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇంతలోనే, కోనసీమ జిల్లాకి బీఆర్ అంబేద్కర్ పేరుని ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. మరోపక్క, మంత్రుల బస్సు యాత్ర కూడా తెరపైకొచ్చింది. ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వెరైటీ రాజకీయం.