ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు తెరవెనుక ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఓ వైపు రాజధానుల అంశం హైకోర్టులో పెండింగ్ లో ఉండగానే ప్రభుత్వం మాత్రం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించిన ప్రభుత్వం అక్కడ ప్రభుత్వ భవనాల నిర్మాణంతో పాటు తాత్కాలిక అవసరాల కోసం స్థలాలను అన్వేషిస్తోంది. ఇటు న్యాయరాజధాని ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పటికే పలుసార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్.. న్యాయరాజధానిగా కర్నూలును నోటిఫై చేయాలని కోరారు. పార్లమెంటులో కూడా ఈ అంశం చర్చకు రాగా.. సబ్ జ్యుడీషియరీ పరిధిలో ఉన్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు.
ఇదిలా ఉంటే కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుపై ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కర్నూలులో న్యాయరాజధానికి ఏర్పాటు జరుగుతున్నాయని.. హైకోర్టు చీఫ్ జస్టిస్ తో చర్చించిన అనంతరం హైకోర్టు తరలింపును చేయపడ్డాలని బుగ్గన తెలిపారు. ప్రభుత్వ తీర్మానానికి హైకోర్టు నుంచి అనుమతులు రాగానే న్యాయరాజధానికి ఏర్పాటు చేస్తామన్నారు. కర్నూలులోని జగన్నాథగట్టు వద్ద న్యాయరాధానిని నిర్మిస్తామన్నారు. జగన్నాథగట్టు వద్ద 250 ఎకరాల భూమిని గుర్తించామని అక్కడే హైకోర్టుతో పాటు జ్యూడీషియల్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు.
బుగ్గన తాజా ప్రకటనతో మరోసారి మూడు రాజధానుల అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. సీఅర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను ఏపీ అసెంబ్లీలో ఆమోదించగా.. మండలిలో ఆమోదం లభించలేదు. ఐతే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ ఈ బిల్లులకు ఆమోదం తెలిపారు. ఐతే ఈ రెండు చట్టాల అమలును నిలిపివేయాలంటూ కొందరు హైకోర్టులు ఆశ్రయించగా.. ధర్మాసనం స్టే విధిచింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల ఏర్పాటుకు బ్రేక్ పడింది.