ఏపీ హైకోర్టు స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై సంచలన తీర్పు వెలువరించింది. ఒక విధంగా చెప్పాలంటే అది వైఎస్ జగన్ ప్రభుత్వానికి షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఎలాగైనా రమేశ్ ఆసుపత్రి ఎండీ రమేశ్ ను అరెస్ట్ చేయడం కోసం పోలీసులు ఆయన కోసం వెతుకుతుండగా.. హైకోర్టు చెప్పిన తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. తమపై అకారణంగా కేసు నమోదు చేశారంటూ రమేశ్ కుమార్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
రమేశ్ ఆసుపత్రి ఎండీ, చైర్మన్ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వారిపై తీసుకోబోయే అన్ని చర్యలను ఆపేయాలంటూ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే.. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ పై కోర్టు స్టే విధించింది. కోవిడ్ కేర్ సెంటర్ కోసం స్వర్ణ ప్యాలెస్ లో అనుమతి ఇచ్చిన అధికారులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టు ప్రశ్నించింది.
ఎన్నో సంవత్సరాల నుంచి ఆ హోటల్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని ఎందుకు వదిలేశారు. స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహణకు అధికారులు ఎలా అనుమతి ఇచ్చారు? ఆ విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులు కూడా ఈ ప్రమాదానికి బాధ్యులే.. అంటూ కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.
దీంతో ప్రభుత్వం తరుపు న్యాయవాదికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. వెంటనే కోర్టు వాళ్లపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించకూడదని తీర్పు చెప్పింది.