AP Govt Employees : మారు వేషాలతో సభ్య సమాజానికి ఏం సంకేతాలు పంపుతున్నారు.?

AP Govt Employees : నిరసనల్లో రకరకాల రూపాలు వుండొచ్చు. పాటల ద్వారా ఉద్యమ చైతన్యాన్ని పెంపొందించొచ్చు.. కాదనలేం. కానీ, ‘ఊ అంటావా మావా..’ అంటూ ఐటమ్ సాంగు థీమ్ తీసుకుని, ముఖ్యమంత్రి మీద జుగుప్సాకరమైన రీతిలో పాటలు పాడటం ప్రభుత్వ ఉద్యోగులకు తగునా.? అక్కడే ఉద్యోగుల అసభ్యకరమైన ఉద్దేశ్యం బయటపడిపోయింది.

పీఆర్సీ ద్వారా ఉద్యోగులకు నష్టం జరుగుతోందా.? అన్నది వేరే చర్చ. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికీ, నిరసన తెలపడానికీ, ఉద్యమం చేయడానికీ చాలా చాలా మార్గాలున్నాయి. ప్రజాస్వామ్య పద్ధతుల్ని పక్కన పెట్టి, వెకిలి చేష్టలకు దిగుతున్నారు ఉద్యోగులు.

ఉద్యమాల్ని ప్రభుత్వాలు అణచివేయడం కొత్తేమీ కాదు. ప్రతిపక్షంలో వున్నప్పుడు వైసీపీ కూడా అనేక నిర్బంధాల్ని ఎదుర్కొంది. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వాన్ని దారుణంగా తూలనాడింది. కానీ, అధికారంలోకి వచ్చాక.. ఆనాటి విధానాల్నే అమలు చేయాల్సి వస్తోంది.

ప్రజా పోరాటాల ద్వారానే అధికారంలోకి వచ్చామన్న విషయాన్ని విస్మరించి, ప్రజా పోరాటాల్ని వైఎస్ జగన్ సర్కారు అణచివేస్తోందన్న విమర్శలూ లేకపోలేదు. అందులో నిజం వుంది కూడా. కానీ, ఉద్యోగుల చేష్టలతో వైఎస్ జగన్ సర్కారే రైటు.. అన్న భావన కలుగుతోంది అందరికీ.

లేకపోతే, ఉద్యోగులు మారు వేషాల్లో ఛలో విజయవాడ కార్యక్రమం కోసం రావడమేంటి.? ఉద్యోగులకు బాధ్యత వుంటుంది. సాటి ఉద్యోగులైన పోలీసుల కన్నుగప్పి తప్పించుకోవడమంటే.. తాము చేస్తున్న ఉద్యోగాల్నీ అవమానించుకుంటున్నట్టే.