AP Govt Employees : ఉద్యోగులు తగ్గాల్సిందే.! వేరే దారి లేదంతే.!

AP Govt Employees : ఏ ప్రభుత్వమైనాసరే, మోయలేనంత ఆర్థిక భారాన్ని పెంచుకుని, ఉద్యోగుల్ని గొంతెమ్మ కోర్కెలు సాధ్యపడే పని కాదు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు వేతనాల పరంగా, ఇతర సౌకర్యాల పరంగా అత్యున్నత స్థానంలో వున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు, ‘సమ్మ’ పేరుతో హంగామాకి సిద్ధమవడమేంటి.?

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఉమ్మడి రాజధాని హైద్రాబాద్ నుంచి ఏపీ ఉద్యోగులు స్వరాష్ట్రానికి వెళ్ళేందుకు ఒకింత ఇష్టపడలేదన్నది నిర్వివాదాంశం. అప్పట్లో ఉద్యోగులకు అదనపు సౌకర్యాలు కల్పించింది చంద్రబాబు ప్రభుత్వం. అవి ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి.

చంద్రబాబు హయాంలో ప్రకటించిన పీఆర్సీ, ఆతర్వాత వైఎస్ జగన్ సర్కార్ కల్పించిన అనేక వెసులుబాట్లు.. వెరసి ఉద్యోగుల కోసం ప్రభుత్వం భారీగానే ఖర్చు చేయాల్సి వచ్చింది. ‘అదంతా అబద్ధం’ అని ఏ ఉద్యోగి కూడా చెప్పలేరు. ఎందుకంటే, ఉద్యోగులకే తెలుసు, తమకు దక్కుతున్న అదనపు సౌలభ్యాలేమిటో.

కొత్త పీఆర్సీ విషయమై ఉద్యోగులు యాగీ చేయడంపై సాధారణ ప్రజానీకం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులకీ సమస్యలు వుండొచ్చుగాక. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వేరే మార్గాలుంటాయి. సమ్మె పేరుతో బ్లాక్‌మెయిల్ చేయాలనుకోవడం సబబు కాదు.

‘తక్కువ జీతాలకు పని చేయడానికి చాలామంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.. ఎవరైతే ఆందోళన చేస్తామంటున్నారో, ఆ ఉద్యోగులందర్నీ తొలగించండి.. రాష్ట్ర ఖజానాపై భారం తగ్గుతుంది..’ అంటూ ప్రజలు నినదించే పరిస్థితి వచ్చిందంటే, ఉద్యోగులు తమ తీరుపై పునరాలోచన చేసుకోవాల్సిందే కదా.?