AP Govt Employees : ఏపీ ఉద్యోగులూ సమ్మె చేసి రాష్ట్రాన్ని ముంచేస్తారా.?

AP Govt Employees : ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇస్తామంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు. ప్రభుత్వం, ఉద్యోగుల పట్ల కనికరం చూపని పక్షంలో, అణచివేత ధోరణి అనుసరించిన పక్షంలో.. ఉద్యోగులు ప్రజాస్వామ్యయుతంగా పోరాడేందుకు ‘సమ్మె’ను అస్త్రంగా ఎంచుకోవచ్చుగాక. కానీ, ప్రస్తుత కోవిడ్ పాండమిక్ పరిస్థితుల్లో ఉద్యోగులు సమ్మెబాట పడితే, అది హర్షించలేని విషయం.

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ విషయమై గుర్రుగా వున్నారు. ప్రభుత్వమేమో తాము ఉద్యోగుల్ని ఉద్ధరించేలా పీఆర్సీ తెచ్చామంటోంది. ఉద్యోగులేమో తమను ముంచేలా ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించిందని చెబుతున్నారు. ఎవరి వాదనలో ఎంత నిజం.? అన్నది వేరే చర్చ.

భిన్న వాదనలున్నప్పుడు, కలిసి కూర్చుని చర్చించుకోవడం ద్వారా సమస్యకు పరిష్కారం వెతకాలి. ప్రభుత్వం తమను చర్చలకు పిలవాలని ఉద్యోగులంటున్నారు.. ఉద్యోగులు చర్చలకు రావాలని ప్రభుత్వం చెబుతోంది. ఈలోగా కొత్త పీఆర్సీ అమలును వాయిదా వేయాలన్నది ఉద్యోగుల వాదన. అయితే, కొత్త పీఆర్సీని అమలు చేసి తీరతామని ప్రభుత్వం చెబుతోంది.

ఈ గందరగోళం నడుమ, ఉద్యోగులు సమ్మె బాట పడతామని హెచ్చరిస్తున్నారు. ఉద్యోగులు లేకపోతే, ప్రభుత్వమెక్కడ వుంటుంది.? ఛాన్సే లేదు. ప్రభుత్వం పని చేయకపోతే, నష్టపోయేది ప్రజలే. ప్రజల్లోనే ఉద్యోగులూ వుంటారు. అంటే, ఉద్యోగులు సైతం నష్టపోవాల్సిందే.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేయడం ఉద్యోగులకు తగదు.. అదే సమయంలో, ఉద్యోగుల్ని చిన్న చూపు చూడటం, వారిని నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వానికీ తగదు.