AP Govt Employees : ఏపీలో ఉద్యోగుల్ని రెచ్చగొడ్తున్నదెవరు.? జగన్ ఏం చేస్తున్నారు.?

AP Govt Employees : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పలు డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. నిరసన కార్యక్రమాలు షురూ అయ్యాయి. అయితే, ఉద్యోగుల్లో స్పష్టమైన చీలిక కనిపిస్తోంది. కొందరు ఉద్యోగులేమో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద తమకు పూర్తి నమ్మకం వుందని అంటున్నారు. ప్రధానంగా పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ప్రభుత్వం మీద ఒకింత అసంతృప్తితో వున్నమాట వాస్తవం.

ఉద్యోగులకి రాజకీయాలేంటి.? అన్నది పాత మాట. ఉద్యోగ సంఘాల నేతలు తెరవెనుక రాజకీయాలు చేస్తూ, ఉద్యోగుల ప్రయోజనాల్ని పణంగా పెడుతుండడం ఎప్పటినుంచో జరుగుతున్న వ్యవహారమే. అలా ఉద్యోగ సంఘాల నాయకులు, తర్వాత్తర్వాత రాజకీయాల్లోకి రావడం, పదవులు పొందడం తెలిసిన సంగతులే. ఇందుకు టీడీపీ నేత, ఉద్యోగ సంఘాల మాజీ నేత అశోక్ బాబు నిదర్శనం.

ఇప్పుడూ అదే జరుగుతోంది. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి అనుకూలంగా వున్నారు. వారి విషయంలో మిగతా ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తితో వున్నారు. పీఆర్సీ సమస్య వుండనే వుంది. దాంతోపాటుగా, ఇంకా చాలా సమస్యలున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

ఉద్యోగులవి న్యాయపరమైన డిమాండ్లని ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారు. అలాంటప్పుడు, వారి డిమాండ్లను పరిష్కరించేస్తే సరిపోతుంది కదా.? కానీ, ఉద్యోగ సంఘాల నేతలకి అధికార పార్టీ నేతలు రాజకీయాలు అంటగడుతున్నారు. ఇది నిజానికి చారిత్రక తప్పిదమే అవుతుంది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక, చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద సమస్యలుగా మారుతుండడం వెనుక, కీలక పదవుల్లో వున్నవారి అవగాహనా రాహిత్యమే ప్రధాన కారణం. ఉద్యోగుల విషయంలోనూ ఆ అవగాహనా రాహిత్యమే సమస్యను పెద్దది చేస్తోందా.? అన్న అనుమానాల్లేకపోలేదు. విషయం ముదిరి పాకాన పడకుండా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకోవాల్సి వుంది.