ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు శరవేగంగా పనిచేస్తోంది. ముందుగా పాలన రాజధానిని విశాఖకు తరలించడానికి సన్నద్దమవుతోంది. ప్రజెంట్ హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడంతో ఇతర వ్యవహారాలను చక్కబెట్టుకునే పనిలో పడింది. ఈ నెల 16న విశాఖలో శంఖుస్థాపన చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ప్రధాని మోదీని కూడా ఆహ్వానిస్తూ పిఎంవోకు లేఖ పంపారు. మరోవైపు ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి నిధులు కావాలంటూ కేంద్రాన్ని కోరింది. మొత్తం 8,000 కోట్లకు పైగా నిధులను 15వ ఆర్థిక సంఘం ద్వారా కేటాయించాలని కోరింది.
ఈ మొత్తంలో 5000 కోట్లు పాలనా వ్యవస్థ కోసం, 1850 కోట్లు న్యాయ వ్యవస్థ భవనాల కొరకు, 1400 కోట్లు శాసన వ్యవస్థ భవనాల కోసం అవసరమవుతాయని లేఖలో తెలిపారట. విభజన చట్టం మేరకు కొత్త రాష్ట్రం కట్టుకునే రాజధానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి. ఆ నిబంధనను అడ్డం పెట్టుకునే ఏపీ ప్రభుత్వం నిధులు అడుగుతోంది. అయితే గతంలో చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణం కోసం 1500 కోట్లు ఇచ్చింది కేంద్రం. మరిప్పుడు మళ్లీ ఇన్ని వేల కోట్లు అడిగితే కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా అనేది చూడాలి.
పైగా లేఖలో అడుగుతున్న నిధులు అమరావతి కోసమా లేకపోతే కొత్త రాజధానుల కోసమా అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా తెలుపలేదు. ఇక రాజధాని వివాదంలో అయితే కేంద్రానికి ఎలాంటి జోక్యం ఉండదని, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని జగన్ సర్కార్ అంటుండగా కేంద్రం కూడా రాష్ట్ర రాజధాని తమ పరిధిలోని అంశం కాదని తేల్చి చెప్పింది. మరి తమకు జోక్యం లేదన్న విషయంలో కేంద్ర ప్రభుత్వం అడిగినంత నిధులు ఇస్తుందా లేకపోతే ఏదో ఒక కారణం చూపి జాప్యం చేస్తుందా అనేది సందేహంగా మారింది. ఇక జనమైతే కొత్త రాజధానులకు అంత ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్న ఏపీ సర్కార్ ఇప్పుడు ఇంత భారీ మొత్తంలో నిధులు కోరడం ఏమిటని అంటున్నారు.