చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈ నేపథ్యంలో పోటెత్తిన వరదల నేపథ్యంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 60కి పైగా.. అని అధికారిక లెక్కలు చెబుతున్నా, అనధికారిక మరణాల సంఖ్య 100కి పైనే వుంటాయన్నది ఓ అంచనా.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వరద పోటెత్తిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితుల్ని ఆదుకుంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగకుండా వెళ్ళిపోవడమేంటి.? అన్న చర్చ సామాన్యుల్లో జరుగుతోంది.
విపక్షాల సంగతి సరే సరి. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు అయితే మరీ తీవ్రమైన వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి మీద విరుచుకుపడిపోయారు. ‘గాల్లోనే తిరుగుతాడు… గాల్లోనే పోతాడు..’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.
తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మీద మండిపడ్డారు. ‘ఆయన సంస్కారానికి ఓ నమస్కారం..’ అంటూ దండం పెట్టిన వైఎస్ జగన్, ‘నేను వెళ్ళడం ముఖ్యమా.? బాధితులకు సాయం అందడం ముఖ్యమా.? నేను వెళితే, అక్కడ మళ్ళీ సమస్యలొస్తాయి. సెక్యూరిటీ సమస్యలు, బాధితులకు ఇబ్బందులు ఎదురవుతాయి.. అందుకే వెళ్ళలేదు..’ అని వైఎస్ జగన్ వివరణ ఇచ్చారు.
ముఖ్యమంత్రిగా వున్న సమయంలో చంద్రబాబు కూడా ఏరియల్ సర్వే నిర్వహించారు. మరి, అలాంటప్పుడు.. గాల్లో వస్తాడు, గాల్లో పోతాడు.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యల్ని చంద్రబాబు, ముఖ్యమంత్రి మీద ఎలా చేయగలిగారు.?