ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ: ముహూర్తం ఫిక్సయ్యిందా.?

AP Executive Capital: Muhurtham Fixed?

AP Executive Capital: Muhurtham Fixed?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు. ప్రస్తుతం మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో వుంది. కుప్పలు తెప్పలుగా కేసులున్నాయి మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించి అవెప్పటికి ఓ కొలిక్కి వస్తాయో చెప్పలేని పరిస్థితి. కానీ, త్వరలో.. అతి త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలిపోతోందంటూ మీడియా వర్గాల్లో గుసగుసలు.. న్యూస్ చానళ్ళలో బ్రేకింగ్ న్యూసులు. అసలేం జరుగుతోంది మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించి. ప్రస్తుతం రాష్ట్రం కరోనా దెబ్బకి విలవిల్లాడుతోంది.

ఈ పరిస్థితుల్లో మూడు రాజధానుల గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందా.? అంటే, ఏమో మరి.. ఖచ్చితంగా ఔననీ, కాదనీ చెప్పలేం. మంత్రి బొత్స సత్యనారాయణ, అతి త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. అని తాజాగా ప్రకటించడంతో ఈ వ్యవహారం చుట్టూ మీడియాలో రకరకాల ఊహాగానాలు షురూ అయ్యాయి. రాజధాని అంటే మాటలు కాదు.

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమీ లేవు. ఏదన్నా విషయంలో ముందడుగు వేద్దామంటే, కోర్టుల్లో పిటిషన్లు పడుతున్నాయి.. ఆయా వ్యవహారాలు అక్కడికక్కడ ఆగిపోతున్నాయి. ఇదంతా కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. అయితే, జులై లేదా ఆగస్టు నెలల్లో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలిపోతుందంటూ కొన్ని మీడియా సంస్థలు జోస్యం చెబుతున్నాయి.

ఇవన్నీ అధికార పార్టీ పంపుతున్న లీకులని ప్రచారం జరుగుతుండడం మరింత ఆసక్తికరం. నిప్పు లేకుండా పొగ రాదు.. అనేది ఇలాంటి విషయాల్లో నిజమే అనుకోవాలి. లేకపోతే, వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి.. ఆ వెంటనే మంత్రి బొత్స సత్యానరాయణ రాజధాని గురించి మాట్లాడటమంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే కదా. ఇప్పటికే అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల కోసం చట్టం చేసేసింది. కానీ, ఆ చట్టం అమలుపై న్యాయస్థానం స్టేటస్ కో విధించింది.