AP Employees Vs AP Govt : ‘మేం అమాయకులం కాదు. మాకు పీఆర్సీ లెక్కలు చెప్పొద్దు. కొత్త పీఆర్సీతో జీతాలు పెరగలేదు, తగ్గాయి. కొంతమంది ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. ఇదేం పీఆర్సీ.? పీఆర్సీ చరిత్రలోనే ఇంత చెత్త విధానం ఇంతకు ముందెన్నడూ చూడలేదు..’ అంటూ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు గుస్సా అవుతున్నారు.
ఇంకోపక్క, ప్రభుత్వం లెక్కలు వేరేలా వున్నాయి. కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు పెగరకపోతే, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఇరవై వేల కోట్ల రూపాయల భారమెలా పడుతుంది.? అన్నది ప్రభుత్వ వాదన. ఉద్యోగులు తప్పు చెప్పే అవకాశం వుండదు. మరి, ప్రభుత్వం చెబుతున్న వాదనల్లో నిజమెంత.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
నిజమే, ప్రభుత్వ ఖజానాపై ఇరవై వేల కోట్ల రూపాయల భారం పడి వుండొచ్చు. దానికి అనేక కారణాలున్నాయి. పీఆర్సీ సంగతి పక్కన పెట్టి, ఉద్యోగులకు బోల్డన్ని ప్రయోజనాల్ని కల్పిస్తున్నామన్నది ప్రభుత్వ వాదన. అలా ఖజానాపై ఆర్థిక భారం పడుతోంది. పీఆర్సీ విషయంలో మాత్రం ఉద్యోగులకు ఇబ్బంది తప్పేలా లేదన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.
కరోనా కష్ట కాలంలో అన్ని రంగాలూ దెబ్బ తిన్నాయి. ఆ లెక్క, ఉద్యోగులూ కొంత మేర త్యాగాలు చేయాల్సి వస్తే చేయాలి కదా.? అన్నది మరికొందరి వాదన. ఎవరి గోల వారిదే. ప్రభుత్వమేమో చర్చలకు ఆహ్వానం పంపింది. ఉద్యోగ సంఘాలేమో, పీఆర్సీ జీవోల్ని వెనక్కి తీసుకుంటే తప్ప చర్చల ప్రసక్తే లేదంటున్నారు.
ప్రభుత్వం ఉద్యోగుల్ని శతృవుల్లా చూస్తోందన్న విమర్శ కొందరు ఉద్యోగుల నుంచి వినిపిస్తోంది.
అందుకు బలమైన కారణమూ లేకపోలేదు. కొందరు వైసీపీ నేతలు మీడియా సాక్షిగానూ, కొందరు వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగానూ ఉద్యోగులపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే సమయంలో కొందరు ఉద్యోగులు ముఖ్యమంత్రిపైనా అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.