అది ఏ పార్టీ అయినా సరే.. క్షేత్ర స్థాయిలో పార్టీ సరిగ్గా ఉండాలి. క్షేత్రస్థాయి నాయకులు సరిగ్గా ఉండాలి. అప్పుడే పార్టీ పటిష్టంగా ఉంటుంది. కానీ.. జిల్లాజిల్లాకు రకరకాలుగా రాజకీయం చేస్తే పార్టీకే నష్టం వస్తుంది. ముఖ్యంగా పార్టీ అధినాయకుడిని నమ్మి.. ఆయనకు అనుగుణంగా క్షేత్ర స్థాయి నాయకులు పనిచేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకంటే.. గుంటూరు జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అధికార పార్టీ వైసీపీ నేతలు జిల్లాను ఎక్కడికక్కడ విభజించేసి పాలించుకుంటున్నారు. విభజించి పాలించు.. అనే సిద్ధాంతాన్న బాగా ఒంటపట్టించుకున్నట్టున్నారు. అందుకే.. ఎవరికి వారో.. యమునా తీరే అన్నట్టుగా ఒకరికి మరొకరికి సంబంధం లేకుండా ఉంది గుంటూరు జిల్లా వైసీపీ నేతల పరిస్థితి.
నిజానికి ఒకే పార్టీకి చెందిన నేతలు కలిసి మెలిసి పనిచేయాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. గుంటూరు జిల్లాలో ఉన్న మూడు ఎంపీ సీట్లలో రెండు వైసీపీవే. అలాగే గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా. ఎవరి పని వాళ్లదే. ఎవరి నియోజకవర్గం వాళ్లదే అన్నట్టుగా ఎవరికి వాళ్లు చక్రం తిప్పుతున్నారు.
మచ్చుకు కొన్ని ఉదాహరణలు చూస్తే.. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఏ పనిచేయాలన్నా సరే.. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అంగీకారం ఖచ్చితమట. ఆయన ఊ.. అనకుండా అక్కడ చీమ కూడా చిటుక్కుమనదు అని టాక్.
అలాగే తాడికొండలో కూడా అదే పరిస్థితి. ప్రత్తిపాడు, వేమూరు నియోజకవర్గాల్లోనూ అంతే. ఎక్కడ దొరికితే అక్కడే అన్నట్టుగా ఎవరికి వారు చక్రం తిప్పుతున్నారు. కొన్ని పనులు ఎమ్మెల్యేలు, ఎంపీల పర్మిషన్ దొరక్క అక్కడికక్కడే ఆగిపోయాయట.
అయితే.. ఈ విషయం కాస్త జగన్ దగ్గరికి చేరిందట. గుంటూరు జిల్లాలో ఇలా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరుపై జగన్ సీరియస్ గా ఉన్నారట. తన టేబుల్ మీదికి గుంటూరు జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేల జాతకం తాలుకు రిపోర్టు వచ్చిందట. దీంతో వాళ్లను త్వరలోనే పిలిచి.. కాస్త గట్టిగానే క్లాస్ పీకే అవకాశం ఉందని తెలుస్తోంది.