అవును.. నిజమే జగన్ సర్కారుకు సుప్రీంలో ఎదురుదెబ్బే తగిలింది. సుప్రీంలో షాకే తగిలింది. హైకోర్టు విధించిన స్టాటస్ క్యూ పై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు చట్టంపై ఏదైనా ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ సుప్రీం కోర్టు జగన్ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.
పాలన వికేంద్రీకరణ బిల్లు అంశంపై ఈనెల 27న హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే నిర్ణీత సమయంలో హైకోర్టు రాజధానుల అంశంపై విచారణ పూర్తి చేస్తే అది జగన్ కు కలిసొచ్చే పాయింటే. ఎందుకంటే.. సుప్రీం కోర్టు కూడా మూడు రాజధానులపై నమోదైన పిటిషన్ ను త్వరగా విచారించాలంటూ ఆదేశించడం.
ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపడుతూ.. అమరావతి రైతులు ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు .. స్టాటస్ కో ఉత్తర్వులను జారీ చేసింది. దానిపై మళ్లీ విచారణ ఈనెల 27న జరగనుంది.
ప్రస్తుతం హైకోర్టు కూడా రాజధాని రైతుల వైపే ఉంది. వాళ్లకు మద్దతుగా వ్యవహరిస్తోంది. తమకు న్యాయం జరిగే వరకు విశాఖలో రాజధానిని అమలు చేయడానికి వీలు లేదంటూ హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో సీఎం జగన్… విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేయడం కష్టంతో కూడుకున్న పనే.
అయితే.. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. హైకోర్టులోనే కాదు.. సుప్రీంకోర్టులో కూడా ఏపీ ప్రభుత్వానికి ఎన్నోసార్లు భంగపాటు ఎదురైంది. ఇక్కడ సమస్య అది కాదు. వైఎస్ జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కు దీనిద్వారా ఓ సందేశం పంపించాలనుకున్నారు. మూడు రాజధానుల అంశంపై తాను ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమే అనే విషయాన్ని చంద్రబాబుకు చేరవేయడంలో సఫలం అయ్యారు. అంటే ఇక్కడ ఇన్ డైరెక్ట్ గా జగన్ గెలిచినట్టే. అందులోనూ హైకోర్టులో ఈ అంశంపై తాత్సారం జరగకుండా త్వరగానే నిర్ణయం వెలువడే అవకాశం కూడా ఉంది.