గోరంట్ల మాధవ్ వీడియో ఫేక్: కన్ఫామ్ చేసిన ఏపీ సీఐడీ.?

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో లీక్ వ్యవహారంపై రాజకీయ దుమారం కొనసాగుతూనే వుంది. అది ఫేక్ వీడియో అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెప్పినట్లుగా పలువురు మంత్రులు మీడియా ముందు ఊదరగొట్టేస్తున్న విషయం విదితమే.

తాజాగా ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ చెబుతున్న అమెరికా ఫోరెన్సిక్ సంస్థ ఇచ్చిన నివేదిక ఒరిజినల్ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టీడీపీ, అమెరికాలోని ఓ ఫోరెన్సిక్ సంస్థతో ఈ వీడియోపై విచారణ చేయించిన విషయం విదితమే.

‘అది ఒరిజినల్’ అని ఆ ఫోరెన్సిక్ సంస్థ ధృవీకరించినట్లుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే, ప్రైవేటు ఫోరెన్సిక్ సంస్థలు ఇచ్చే నివేదికలకు చట్టబద్ధత లేదన్నది ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వాదన. అంతే కాదు, ఎవరైతే ఫోరెన్సిక్ పరీక్ష కోసం వీడియోను ఆ సంస్థకు ఇచ్చారో, ఆ వ్యక్తి కొన్ని మార్పులు చేయాలని ఆ సంస్థకు సూచించారని సునీల్ కుమార్ పేర్కొన్నారు.

సదరు ఫోరెన్సిక్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక పంపిందంటూ ఓ లెటర్‌ని కూడా మీడియాకి విడుదల చేసింది ఏపీ సీఐడీ. అయితే, దానికి సంబంధించిన డాక్యుమెంట్ (ఫోరెన్సిక్ రిపోర్ట్) మాత్రం విడుదల చేయలేదు. ఈ విషయమై టీడీపీ నేత వంగలపూడి అనిత పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఫోరెన్సిక్ పరీక్షకు వీడియోను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పంపలేదు.? అంటూ వంగలపూడి అనిత ప్రశ్నించారు. అది ఫేక్ వీడియో అనడానికి ఎవరికీ అర్హత లేదనీ, అది ఫేక్ లేదా ఒరిజినల్ అనేది తేల్చాల్సింది ఫోరెన్సిక్ విభాగం మాత్రమేనని టీడీపీ అంటోంది.

కాగా, వీడియోను సర్క్యులేట్ చేసినవారిపై చర్యలుంటాయంటూ ఏపీ సీఐడీ చీఫ్ ప్రకటించడం కొసమెరుపు.