AP Budget : ఏపీ బడ్జెట్ లెక్కలు సరే.! ప్రజలకు ఒరిగేదేంటి.?

AP Budget : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ అంచనాల పేరుతో అంకెల గారడీ చేసిందన్న విపక్షాల విమర్శలు పక్కన పెడితే, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు.? ‘ఇది అత్యుత్తమైన బడ్జెట్.. కష్ట కాలంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం.. ప్రజల తలసరి ఆదాయం పెంచాం..’ అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటల్లో నిజమెంత.?

దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగేదేంటి.? అన్న చర్చ అయితే కాస్తో కూస్తో జనంలో కనిపిస్తోంది. బడ్జెట్ అనగానే ‘రచ్చబండ’ వేదికల వద్ద చర్చ జరగడం సహజమే. అయితే, గతంలోలా టీవీల్లో లైవ్ కవరేజ్‌లను చూసేందుకు జనం పెద్దగా ఇష్టపడటంలేదు.

అధికారంలో వున్నోళ్ళు ఏవేవో లెక్కలు చెబుతారు.. వాటికి కట్టుబడి వుండరన్న ఆవేదన జనంలో పెరిగిపోయింది. రాజధాని గురించి మాట్లాడకుండా, రాజధానికి కేటాయింపులు సరిగ్గా లేకుండా.. అసలు రాష్ట్ర బడ్జెట్ ఏంటి.? అన్న కీలకమైన ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేదు.

రాజధాని లేకపోతే, అసలు రాష్ట్ర మనుగడకు అర్థమేంటి.? అని జనం చర్చించుకుంటున్నారు. హైకోర్టు మొట్టికాయలేసింది ఇటీవల రాష్ట్ర రాజధాని విషయంలో. మరి, ఆ మేరకు రాజధాని అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి కదా.? అదేమీ లేదాయె.

సరే, ప్రభుత్వానికి సంక్షేమమే అసలు సిసలు ప్రయారిటీ. ఆ దిశగా కేటాయింపుల్లో అంకెలు ఘనంగానే కనిపిస్తున్నాయి. అభివృద్ధి గురించి మాట్లాడుకోడానికేమీ లేదు. కేటాయింపులుంటాయిగానీ, ఖర్చుల లెక్కలే బయటకు రావు.

రోడ్లపై గుంతల్ని పూడ్చడానికి కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కనిపిస్తుందేమో.!