తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా బలపడడానికి బీజేపీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అవకాశం ఉన్న ప్రతిచోటా ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అయితే బీజేపీ నాయకులు వైసీపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఎదగడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణను తప్పిస్తూ సోము వీర్రాజును కేంద్ర బీజేపీ నాయకులు నియమించారు. కన్నా లక్ష్మీ నారాయణ టీడీపీకి అనుకూలంగా ఉన్నారన్న వాదన వల్ల ఆయనను తొలగించారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఇప్పుడు సోము వీర్రాజుకు సొంత పార్టీలోనే వ్యతిరేకులు ఉన్నారని తెలుస్తుంది.
రాష్ట్రంలో బీజేపీని పరుగులు పెట్టిస్తానని చెప్పిన బీజేపీ ఏపీ సారథి.. సోము వీర్రాజు ఈ విషయంలో ఒకింత దూకుడు ప్రదర్శించారు. అయితే ఆ దూకుడుకు సొంత పార్టీ నేతలు కళ్లెం వేస్తున్నారు. పార్టీలో ఉన్న వారిలో చాలా మందికి సోము వీర్రాజు అంటే పెద్దగా పడడం లేదు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కూడా బీజేపీ నాయకులు అసంతృప్తి కనపరుస్తున్నారు.
తాజాగా దేవాలయాల మీద దాడులను వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో కదిలి వచ్చారు. అయితే
ఈ ఉద్యమానికి ఇంతలా బీజేపీ నాయకులు రావడానికి సోము వీర్రాజు పిలుపు కారణం కాదట. ఈ రేంజ్‌లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం, రోడ్లెక్కడం వెనుక.. వేరే ఆలోచన ఉందనే ప్రచారం జరుగుతోంది. మంత్రి నాని నేరుగా కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేసిన నేపథ్యంలోనే సీనియర్లు రోడ్లెక్కారని, రాష్ట్ర బీజేపీ విషయంలో కాదనేది పరిశీలకుల మాట.
ఈ ఉద్యమం సోము వీర్రాజుకు నైతిక విజయం లాంటిదని చాలామంది నేతలు, రాజకీయ విశ్లేకులు చెప్పారు కానీ ఈ విజయం సోము ఎంత మాత్రం కాదని బీజేపీ నాయకులే చెప్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిపై బీజేపీ నాయకులకు ఎందుకింత కోపం ఉందొ తెలియదు కానీ ఇలాగే కొనసాగితే మాత్ర బీజేపీకి చాలా ప్రమాదం.