ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఏపీకి మూడు రాజధానులు అని ప్రకటించిన నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ నేతలు ఏపీకి అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. జనసేన, బీజేపీ నేతలు సైతం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. జగన్ అమరావతినే రాజధానిగా ఫైనల్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు వచ్చేవి కావు.
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం వల్ల రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు ఎదురవుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విశాఖను రాజధాని చేసే దిశగా జగన్ అడుగులు వేస్తే ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో జగన్ సర్కార్ పై వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మరోవైపు అమరావతిలో ఏడు రోజుల పాటు మనం.. మన అమరావతి పాదయాత్ర కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తో పాటు కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి, మరి కొందరు బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాజధాని విషయంలో జగన్ నిర్ణయం మారడంతో అమరావతి రైతులకు అన్యాయం జరిగిందని కొంతమంది బీజేపీ నేతలు విమర్శలు చేస్తే సీఎం మారిన ప్రతిసారి రాజధానిని మార్చితే అభివృద్ధికి చేటు అని మరి కొందరు కామెంట్లు చేశారు.
2024లో వైసీపీ కాకుండా మరో పార్టీ అధికారంలోకి వచ్చినా ఏపీకి అమరావతే రాజధానిగా కొనసాగే అవకాశాలు అయితే ఉంటాయి. జగన్ ఏ కారణం వల్ల అమరావతిని రాజధానిగా వద్దనుకున్నారో తెలీదు కానీ ఈ నిర్ణయం వల్ల పార్టీకి నష్టమే తప్ప ఏ మాత్రం లాభం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రజలు సైతం సంతృప్తితో లేరని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.