వైసీపీలో జగన్ ఏకపక్ష వైఖరి అప్రతిహతంగా సాగుతోంది. ఆయన అనుగ్రహం కోసం నేతల వెంపర్లాడుతూనే ఉన్నారు. ఎన్నికల్లో గెలిచినా వారు, ఓడినవారు, అసలు పోటీలోనే నిలబడనివారు ఇలా అందరూ అధినేతను ప్రసన్నం చేసుకోవడం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఒక్కోసారి శృతిమించుతున్నాయి కూడ. ఎలాగైనా సీఎం చల్లని చూపు తమ మీద పడాలనే తపనలో అవసరానికి మించి రియాక్ట్ అయిపోతున్నారు. ప్రత్యర్థులను మరీ దిగజార్చేసి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. కొందరు మంత్రుల సంగతైతే చెప్పాల్సిన పనే లేదు. నోటికి పని చెబితేనే నాయకుడు గుర్తిస్తాడనే ఆలోచనలో మునిగి ఉన్నారు.
వైసీపీలో ఉన్న ఈ వాతావరణం అన్ని పార్టీల్లోనూ ఉండేదే. కానీ మరీ ఇంత విపరీతంగా అయితే ఎప్పుడూ లేదులెండి. ఈ విషయం ఎలా ఉన్నా సాక్షాత్తు స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం జగన్ వద్ద మార్కులు తెచ్చుకోవాలని తహతహలాడటం చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. సభాపతి అంటే రాజ్యాంగబద్దమైన పదవి. ఎలాంటి ప్రలోభాలకు, ప్రభావాలను లోను కాకూడని పోస్ట్. స్పీకర్ పదవిని అలంకరించే అవకాశం అధికార పార్టీ నేతలకే ఉంటుంది. ఎమ్మెల్యేగా గెలిచిప్పటికీ ఒక్కసారి స్పీకర్ బాధ్యత తీసుకుంటే మారిపోయి తీరాలి. అప్పటివరకు అందరిలాంటి రాజకీయనాయకుడే అయినా స్పీకర్ చైర్లో కూర్చున్నాక వారు వేరు నేను వేరు, నాకు అందరూ ఒక్కటే అనే భావనలోకి వెళ్లిపోవాలి.
స్పీకర్ అంటే రాజ్యాంగానికి కట్టుబడాలి :
అయితే ఎంతమంది స్పీకర్లు ఈ కట్టుబాటుకు కట్టుబడి పనిచేశారన్నదే మిలియన్ డాలర్ ప్రశ్న. ఇప్పటివరకు చేసిన స్పీకర్లు ఎంత నియంత్రలో ఉన్నా ఏదో ఒక సందర్భంలో సొంత పార్టీకి అనుకూలంగా వ్యహరించినవారే. ప్రతిపక్షం మైకులు కట్ చేసి ఏకపక్ష వాతావరణాన్ని సృష్టించినవారే. దశాబ్దాలుగా ఇది కామన్ అయిపోయింది. అప్పటివరకు అందరి మనిషిలా ఉండే స్పీకర్లు సభలోకి కీలకమైన బిల్లు ప్రవేశం జరగ్గానే సొంత మమకారాన్ని చూపెట్టేవారు. అయితే అది కొద్దిసేపే, కొన్నిసార్లే అన్నట్టు ఉండేది వాళ్ళ తీరు. ఇక బయట అయితే స్పీకర్ పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రతిపక్షాల మీద విరుచుకుపడిపోవడం అరుదే. కానీ తమ్మినేని మాత్రం హౌస్ లోపల, బయట అధికార పార్టీ వ్యక్తిగానే ప్రాజెక్ట్ అవుతున్నారు.
మంత్రి పదవి కాంక్ష :
నిజానికి తమ్మినేని మంత్రి పదవి చేపట్టాలనేది లక్ష్యం. కానీ జగన్ నిర్ణయాలు మూలాన స్పీకర్ అవ్వాల్సి వచ్చింది. దీంతో రెండున్నరేళ్ల తర్వాతైనా మంత్రి వర్గంలోకి ప్రవేశించాలని భావించి జగన్ వద్ద మంచి మార్కులు తెచ్చుకునే పని మొదలుపెట్టారు. సభలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీతో కలిసి ప్రతిపక్షం మీద జోకులు వేసి ఎంజాయ్ చేస్తున్నారు. వైసీపీ నేతలు మైక్ అందుకుంటే సావధానంగా ఉందామంటూ ప్రతిపక్షం నోరెత్తితే ఇక చాలన్నట్టు ఉంటున్నారు. ఎంత 151 మంది ఎమ్మెల్యేలున్నా స్పీకర్ మధ్యస్తంగా ఉంటే ప్రతిపక్షం ధైర్యంగానే ఉంటుంది. కానీ టీడీపీ అసెంబ్లీలో చిగురుటాకులా వణికిపోతోంది. సభాపతి సపోర్ట్ మొత్తం వైసీపీకే ఉంటోంది మరి.
జగన్ హ్యాపీయే :
అంతేకాదు బయట చూస్తే మామూలు ఎమ్మెల్యే తరహాలో టీడీపీని, చంద్రబాబును ఏకిపారేస్తున్నారు. ఒక్కోసారి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కోర్టుల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగలడం చూసి ఓర్వలేక కోర్టులకే చురకలేశారు. అన్నీ కోర్టులే నిర్ణయిస్తే ఇక ప్రభుత్వం ఎందుకంటూ మండిపడ్డారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మరొక రాజ్యాంగ వ్యవస్థ మీద విరుచుకుపడటం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. జగన్ అయితే తమ్మినేని విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారట. అనుకూలంగా, సభలో అండగా ఉన్నారని శభాష్ అనుకుంటూ త్వరలోనే ఆయనకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలో ఉన్నారట.