బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడును పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిజానికి నూతన్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేసింది దళిత యువకుడి శిరోముండనం కేసులో. దళిత యువకుడికి కావాలని గుండు చేయించి హించించినట్టు నూతన్ నాయుడు, ఆయన భార్యతో పాటు మరో ఏడుగురిపై ఆరోపణలు రావడంతో వీళ్లను అరెస్ట్ చేయడానికి పోలీసులు సెర్చ్ ప్రారంభించారు.
కేసు నమోదు అయిన తర్వాత ముందుగా ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్లతో పాటుగా నూతన్ నాయుడు భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ.. నూతన్ నాయుడు దొరకలేదు. తప్పించుకుతిరిగాడు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
ఈనేపథ్యంలో ముంబై పారిపోతున్న నూతన్ నాయుడును పోలీసులు చాకచక్యంగా కర్ణాటకలోని ఉడిపిలో అదుపులోకి తీసుకున్నారు.
నూతన్ నాయుడు ఇంట్లో పని చేసే ఓ యువకుడు పనికి కొన్ని రోజులు రాకపోవడంతో అతడిని ఇంటికి పిలిచి అవమానించి.. చేయని నేరాన్ని మోపి.. అతడికి అందరి ముందు ఇంట్లోనే నూతన్ నాయుడు భార్య మధుప్రియ గుండు గీయించినట్లు ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులకు చిక్కింది. దాన్ని ఆధారంగా చేసుకొని పోలీసులు వీళ్లను అదుపులో తీసుకున్నారు.
అయితే.. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే… మాజీ ఐఏఎస్ అధికారి పేరుతో నూతన్ నాయుడు పలు ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు 30 మందికి నూతన్ నాయుడు ఫోన్లు చేసినట్టుగా తాము గుర్తించామని… వైజాగ్ సీపీ మనీష్ కుమార్ వెల్లడించారు. నూతన్ నాయుడిని అరెస్ట్ చేసిన వెంటనే ఆయన దగ్గర ఉన్న 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ ఫోన్ల కాల్ డేటాను విశ్లేషిస్తే.. అసలు నిజం బయటికి వస్తుందని పోలీసులు చెబుతున్నారు.