వైసీపీలో కొందరు లీడర్లు వైఎస్ జగన్ తర్వాత మేమే అనే రీతిలో ప్రవర్తిస్తుంటారు. మంత్రులైతే జగన్ తమకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారన్నట్టు వ్యవహరిస్తుంటారు. జగన్ శిఖర స్థాయిలోనే దృష్టిపెట్టి సంక్షేమ పథకాల అమలులో నిమగ్నమై క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పెద్దగా పట్టించుకోవట్లేదు. దీంతో ద్వితీయ స్థాయి నాయకులు చెలరేగిపోతున్నారు. పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను వాళ్ళే చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఒక నాయకుడు మాత్రం అందరినీ మించి అజమాయిషీ చెలాయిస్తున్నట్టు వైసీపీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.
సదరు లీడర్ జగన్ తర్వాత జగన్ అంతటి స్థాయిలో కూర్చుని ఉన్నారట. పార్టీకి సంబంధించిన ఏ వ్యవహారమైనా ఆయన కనుసన్నల్లోనే నడుస్తోందట. ఇద్దరు ముగ్గురు లీడర్లు పార్టీలో నెంబర్ 2 పొజిషన్ కోసం పోటీ పడుతుంటే ఆయన మాత్రం తనతో ఎవరికీ పోటీ లేదని దూసుకెళ్ళిపోతున్నారట. ఇప్పటికే జగన్ చుటూ ఒక కోటరీ ఏర్పడి ఉందని వైసీపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఆ కోటరీలో కొందరు మంత్రులు ఉన్నారు. జగన్ వరకు వెళ్లాలంటే ఆ కోటరీని దాటుకుని వెళ్లాలనేది ఇన్నాళ్లు ఎమ్మెల్యేల్లో, ఎంపీల్లో వినిపించిన మాట. కానీ ఇప్పుడా కోటరీకి ముందు ఆ షాడో సీఎం ఉన్నారని, సీఎం వరకు వెళ్లాలంటే కోటరీ నాయకులైనా సరే ఆ వ్యక్తిని దాటే వెళ్లాలని మిగతా లీడర్లకు అర్థమవుతోందట.
అంటే ఎమ్మెల్యేలు సీఎంను కలవాలంటే ఇప్పుడు రెండు దశలను దాటాలన్నమాట. అసలే బిజీ ముఖ్యమంత్రిని కలవలేక, నియోజకవర్గాల్లో పనులు జరుపుకోలేక సగానికి పైగా ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. నియోజకవర్గ ప్రజలేమో అభివృద్ధి పనులేవని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం తలకిందులుగా తపస్సు చేయాల్సి వస్తోంది. గత ఏడాదిన్నర కాలంలో జగన్ దర్శనం కోసం అనేకసార్లు ప్రయత్నించి డీలా పడిన ఎమ్మెల్యేలు కనీసం ఆ షాడో ముఖ్యమంత్రి వరకు కూడా వెళ్లలేకపోయారట. దీంతో నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని, అది ఒక్కసారి బయటపడితే పార్టీకి తీవ్ర నష్టమని విశ్లేషకులు, వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.