నెల్లూరు జిల్లాలో మొదటి నుండి రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. కొన్నాళ్ల క్రితం వరకు పార్టీ ఏదైనా రెడ్డి నేతలదే అక్కడ హవా. పైగా జిల్లాలో దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీదే పైచేయిగా ఉండటంతో పెద్ద రెడ్లకు తిరుగులేకుండా ఉండేది. అలా నెల్లూరు జిల్లాలో పెత్తనం చేసిన కుటుంబాల్లో ఆనం కుటుంబం కూడ ఒకటి. ఆనం సోదరులంటే కాంగ్రెస్ హయాంలో సపరేట్ ఇమేజ్ ఉండేది. రాష్ట్రంలో ఏ మూలనైనా మాట నెగ్గించుకోగల పలుకుబడి వారి సొంతం. ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్ప మిగతా అన్ని పదవులనూ ఆనం సోదరులు అలంకరించారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ కనుమరుగవడం, ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఆనం వివేకానందరెడ్డి కాలం చేయడంతో రాజకీయంగా ఆ కుటుంబం వెనుకబడింది.
పైపెచ్చు జిల్లా వైసీపీలో యువ నాయకులు పుట్టుకొచ్చారు. వారి డామినేషన్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ బలమైన నేతగా ఎదిగారు. రెండు పర్యాయాలు ఎమెమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆనం కుటుంబం నుండి ఒక్క రామనారాయణరెడ్డి మాత్రమే ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆయన కూడ వైసీపీలోనే ఉన్నారు. వేంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఘాట్ ఎన్నికల్లో గెలిచినప్పుడు మంత్రి పదవిని ఆశించారు ఆయన. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసి ఉండటంతో జగన్ నుండి కూడ అదే తరహా ట్రీట్మెంట్ ఆశించారు. కానీ జగన్ ఆయన్ను పక్కనబెట్టి అనిల్ కుమార్ ను మంత్రిని చేశారు. అక్కడే రగడ మొదలైంది.
ఒకప్పుడు జిల్లా రాజకీయాల్ని శాసించిన కుటుంబం కావడంతో ఇప్పుడు యువ నెతల ఆధిపత్యం కింద పనిచేయాల్సి రావడం ఆయనలో అసహనాన్ని రేకెత్తిస్తోంది. పైగా అనిల్ కుమార్ యాదవ్, కొటంరెడ్డిలు ఆనంను పెద్దగా లెక్క చేయడంలేదనే టాక్ కూడా ఉంది. గతంలో కూడా ఆనం జిల్లాలో రౌడీ రాజ్యం నడుస్తోందని మండిపడుతూ తిరుగుబాటై స్వరం వినిపించారు. కానీ జగన్ పట్టించుకోలేదు. దీంతో సైలెంట్ అయిపోయిన ఆయన త్వరలో మంత్రివర్గంలో మార్పులు ఉంటాయి కాబట్టి అప్పుడు చూసుకుందాం అనుకున్నారు. అనిల్ కుమార్ మంత్రివర్గంలో నుండి బయటికొస్తే తన ప్రాభవం పెరుగుతుందని, ఒకవేళ తనకే కేబినెట్లో చోటు దక్కితే ఇక తిరుగే ఉండదని లెక్కలు వేసుకున్నారు.
కానీ ఆ లెక్కలన్నీ తారుమారయ్యేలా ఉన్నాయి. జగన్ మంత్రివర్గంలో మార్పులు చేయడం ఖాయంగానే కనబడుతోంది కానీ అనిల్ కుమార్ యాదవ్ ను మాత్రం కేబినెట్ నుండి తప్పించే ఆలోచన ఆయనలో లేదని తెలుస్తోంది. ఈ ఏడాదిన్నరలో అనిల్ కుమార్ యాదవ్ మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చారు. పోలవరం విషయంలో బాగానే డిఫెండ్ చేస్తూ తెలుగుదేశం మీద విరుచుకుపడిపోతున్నారు. అది జగన్ కు బాగా నచ్చిందట. అందుకే పోలవరం పూర్తయ్యేవరకు అనిల్ కుమార్ మంత్రిగా ఉండాల్సిందేనని అనుకుంటున్నారట. అదే నిజమైతే ఆనంకు ఇంకో రెండున్నరేళ్లు ఆశాభంగం తప్పదు. ఒకవేళ డామినేషన్ తట్టుకోలేక మరీ విసిగిపోతే అన్నీ సర్దుకుని పార్టీ నుండి బయటకు రావడం మినహా ఆయన చేయగలిగింది ఏమీ ఉండదు.