Anil Frustration : వైసీపీ కొంప ముంచుతున్న మాజీ మంత్రి అనిల్ ఫ్రస్ట్రేషన్.!

Anil Frustration : సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్న వ్యతిరేకత కారణంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌లో అసహనం పెరిగిపోతోంది. ఈ క్రమంలో అధినేత మెప్పు కోసం అడ్డమైన ఆరోపణలూ చేస్తున్నారు అనిల్. ‘మా పార్టీలో గ్రూపుల్లేవ్.. ఎవరైనా వైఎస్ జగన్ ఫొటో పెట్టుకుని గెలవాల్సిందే..’ అంటూ అనిల్ ఎవరికి సందేశమిస్తున్నట్టు.? ఎవర్ని హెచ్చరిస్తున్నట్టు.?

సొంత జిల్లాలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో అనిల్ కుమార్ యాదవ్‌కి రాజకీయ విభేదాలున్నాయి. తాజా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితోనూ అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ పంచాయితీ పెట్టుకున్నారు. సొంత పార్టీలోనే.. ఇలా చాలామందితో అనిల్ కుమార్ యాదవ్‌కి రాజకీయ వైరం వుంది.

తన ప్రత్యర్థికి పదవి ఇచ్చి, ఆ పదవిని తన నుంచి వైఎస్ జగన్ లాగేశారన్న అసంతృప్తి, అసహనం అనిల్ కుయార్ యాదవ్‌లో పెరిగిపోతోంది. అంతే మరి, కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రి అవడం అనిల్‌కి ఇష్టం లేదు. ఆ లెక్కన కాకాణి, అనిల్‌కి రాజకీయ ప్రత్యర్థి అనే అనాలి కదా.!

గడచిన మూడేళ్ళలో జిల్లా అభివృద్ధి చెందలేదన్న భావన మాజీ మంత్రి, వైసీపీ నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వ్యక్తం చేయడమూ అనిల్ అసహనానికి కారణమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని రాజకీయంగా విమర్శిస్తే, వైసీపీలో తానెదుగుతానని అనిల్ అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

మూడేళ్ళు జల వనరుల శాఖ మంత్రిగా పని చేసి కూడా, ‘పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంటి.?’ అని మీడియా అడిగితే, ‘చెప్పను బ్రదర్’ అనడమే మంత్రిగా అనిల్ వైఫల్యం చెందారనడానికి నిలువెత్తు నిదర్శనం. అందుకే ఆయన్ని పీకి పారేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రి వర్గం నుంచి.

ప్రజలకు దగ్గరైతే పదవి మళ్ళీ వస్తుందేమోగానీ.. వైసీపీకి పెద్దగా పోటీ కూడా కాని జనసేన మీద విమర్శలు చేయడం ద్వారా, ‘తిట్ల శాఖ మంత్రిని నేనే’ అని అనిల్ అనుకుంటే ఎలా.?