Andhra pradesh and Telangana: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తొలుత మహారాష్ట్రలో షురూ అయ్యింది. అక్కడి నుంచే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు వైరస్ సునామీలా విస్తరించింది. మహారాష్ట్రలో అసాధారణ రీతిలో కేసులు పెరుగుతున్న సమయంలో తెలుగు రాష్ట్రాలు ఎందుకు ప్రమాదాన్ని ముందే పసిగట్టలేకపోయాయ్.? అన్నది ఇప్పుడు అందర్నీ వేధిస్తోన్న ప్రశ్న. మహారాష్ట్రతో ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి సరిహద్దు లేదు. కానీ, తెలంగాణకు మాత్రం వుంది.
మహారాష్ట్ర నుంచి కరోనా రోగులు వచ్చేస్తున్నారంటూ మీడియాలో కథనాలు షురూ అయినా, తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం కాలేకపోయింది. మహారాష్ట్ర నుంచే కాకుండా, కర్నాటక నుంచి కూడా కరోనా రోగులు తెలంగాణ రాష్ట్రానికి రావడం మొదలైంది. దాంతో, తెలంగాణలో రికార్డు స్థాయిలో ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఆంధ్రపదేశ్ రాష్ట్రం మొదటి వేవ్ సందర్భంగా 10 వేల మార్క్ చూసిందిగానీ, తెలంగాణలో అందులో సగం కూడా మొదటి వేవ్ సందర్భంగా కనిపించలేదు. కానీ, ఇప్పుడు 8 వేల మార్క్ దాటేసింది తెలంగాణలో.
ఈ పాపం ఎవరిది.? ఇంకెవరిది ముమ్మాటికీ తెలంగాణ ప్రభుత్వానికే. అయితే, రాష్ట్రాల మధ్య రాకపోకలపై కేంద్రం నిషేధం విధించలేదుగనుక, రాష్ట్రాలు నిషేధం విధించొద్దని కేంద్రం సూచించింది గనుక, తెలంగాణ రాష్ట్రం ఛాన్స్ తీసుకోలేకపోయిందన్నది ఇంకో వాదన. తెలంగాణలో ముందుగానే విద్యా సంస్థల్ని మూసివేయించడం గొప్ప విషయమే. నైట్ కర్ఫ్యూ విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శించిన ముందు చూపుని అభినందించాల్సిందే.
కానీ, కరోనా సెకెండ్ వేవ్.. సునామీలా విరుచుకుపడుతోందన్న ముందస్తు సంకేతాలు కనిపించినా, తగిన స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేసుకోకపోవడం ఆక్షేపణీయమే. ఆంధ్రపదేశ్ కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించినట్లే కనిపిస్తోంది. కీలక నిర్ణయాల్లో ఆలస్యం, ప్రజల ప్రాణాల మీదకు తెచ్చిందిప్పుడు.