AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యధావిధిగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేసిన విధంగానే కూటమి నేతలు కూడా స్వయంగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్ అందజేస్తున్నారు. ఇక గతంలో వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయగా ప్రస్తుతం మాత్రం సచివాలయ ఉద్యోగస్తులు పెన్షన్ అందజేస్తున్నారు.
ఇక తెల్లారేసరికి లబ్ధిదారుల చేతికి పెన్షన్ అందేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంతో సచివాలయ ఉద్యోగస్తులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. తెల్లవారి 5:30 కి వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడంలో ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మహిళ ఉద్యోగులు కూడా ఈ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం పింఛన్ల పంపిణీ విషయంలో పునరా ఆలోచన చేసిందని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే మార్చ్ ఒకటో తేదీ నుంచి పింఛన్ల పంపిణీ విషయంలో టైమింగ్స్ కూడా మార్పులు చేశారని తెలుస్తోంది. గతంలో మాదిరి తెల్లవారుజామున 5:30కే కాకుండా ఉదయం 7 గంటల నుంచి పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అందుకు అనుగుణంగానే యాప్స్ అన్ని కూడా ఓపెన్ అయ్యేలా ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో పెన్షన్ల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తోంది. ఇప్పటికే అనర్హులపై దృష్టిపెట్టిన ప్రభుత్వం అర్హత లేదని తెలియగానే వారిని జాబితా నుంచి తొలగిస్తోంది. ఇప్పటికే ఎంతోమంది వికలాంగుల పెన్షన్ విధానంలో తప్పుడు సర్టిఫికెట్లను పెట్టి అనర్హులు కూడా పెన్షన్ తీసుకుంటున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మరోసారి వెరిఫికేషన్ జరుపుతూ అనర్హుల జాబితా అని తొలగిస్తే కొత్తవారికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు దీంతో ఇప్పటికే పలు ప్రాంతాలలో వెరిఫికేషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా పింఛన్ల పంపిణీలో ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తూ ఉన్నారు. అయితే ఉదయం ఏడు గంటల నుంచి పింఛన్ పంపిణీ విధానం సచివాలయ ఉద్యోగస్తులకు పెద్ద రిలీఫ్ ఇచ్చిందని చెప్పాలి.